నియోజకవర్గాల పెంపుపై ముందుగా విధివిధానాలు ఖరారు చేయాలి:సీఎం రేవంత్ రెడ్డి

Spread the love

దేశంలో నియోజకవర్గాల సీట్ల పెంపు, పునర్విభజన ప్రక్రియ జీఎస్‌డీపీ ఆధారిత హైబ్రీడ్ మోడల్‌లో జరగాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్ల రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయడానికి సంపూర్ణ మద్దతునిస్తామన్నారు. అయితే లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు కేంద్రం ప్రకటించిన ప్రాతిపదిక దేశంలోని ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరం పెంచడమే కాకుండా దేశానికి ప్రమాదకరంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఇక ఆయన హైబ్రీడ్ మోడల్‌ను ప్రతిపాదించారు. ప్రస్తుత 543 లోక్‌సభ స్థానాల్లో పెంచాలనుకుంటున్న 50 శాతం అంటే 272 స్థానాల్లో 136 సీట్లను ప్రొరేటా ప్రకారం, మిగిలిన 136 సీట్లను జాతీయ స్థూల ఉత్పత్తిని బేస్ చేసుకుని డివైడ్ చేసి అత్యధిక శాతం అందిస్తున్న రాష్ట్రాలకు ప్రాధాన్యతనివ్వాలని ప్రతిపాదించారు. ఈ నెల 16 నుండి జరిగనున్న  పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లతో పాటు నియోజకవర్గాల పెంపు బిల్లును హడావిడిగా ఆమోదించాలని ప్రయత్నిస్తున్నారన్నారు. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు, నియోజకవర్గాల సంఖ్య పెంపు – పునర్విభజన రెండింటినీ ఒకటిగా చూపే  ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇవి రెండు వేర్వేరు అంశాలని  ఒకదానికి ఇంకొకటి సంబంధం లేదు. రెండూ వేటికవే చాలా ప్రాధాన్యత కలిగిన అంశాలన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సంఖ్య నిర్ణయం అంగీకరించబోమని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు. దాంతో ఇంకో రూపంలో దామాషా ప్రకారం 50 శాతం పెంచుతామని ముందుకు తెచ్చారన్నారు.  తాజా ప్రతిపాదనల మేరకు 20 స్థానాలున్న కేరళంలో 50 శాతం పెంచితే ఆ రాష్ట్ర స్థానాలు 60 కి చేరుతాయని అదే ఉత్తరప్రదేశ్ 80 స్థానాలు 120 కి చేరుతాయి. రెండింటి మధ్య అంతరం 90 స్థానాలవుతాయి. 50 శాతం పెంచడం వల్ల తెలంగాణకు యూపీకి మధ్య ఇప్పుడున్న వ్యత్యాసంకన్నా ఎక్కువగా 94 సీట్ల అంతరం పెరుగుతుందన్నారు. 413 సీట్లున్న ఉత్తరాదిలో 50 శాతం సీట్లు పెంచడం వల్ల 621 కి పెరుగుతాయి. అంటే దక్షిణాదికి ఉత్తరాదికి మధ్య సీట్ల అంతరం 412 నుంచి 620 కి పెరుగుతాయి. దక్షిణాది రాష్ట్రాలకు తీరని విఘాతం. చిన్న రాష్ట్రాలు రాజకీయంగా ద్వితీయశ్రేణి రాష్ట్రాలుగా మిగిలిపోతాయని పేర్కొన్నారు. ఈ పరిణామాలు దేశ మనుగడకు మంచిది కాదని ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశం కాదని దేశ ప్రజలకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు.  దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఆదాయం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని  పేర్కొన్నారు. హైబ్రీడ్ మాడల్‌లో 136 సీట్లు ప్రొరేటా ప్రకారం ఇవ్వండి. ఇంకో 50 శాతం సీట్లు దేశం స్థూల ఆర్థిక ఉత్పత్తి ప్రాతిపదికన ఇవ్వాలని ప్రతిపాదన చేశారు. నియోజకవర్గాలను పెంచడానికి నిపుణుల కమిటీని నియమించాలని  నివేదికను సభల్లో చర్చకు పెట్టాలన్నారు.  రాష్ట్రాల అసెంబ్లీల అభిప్రాయాలను తెలుసుకోవాలన్నారు. జనగణన కోసం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున అవి పూర్తయ్యే లోగా అందరి అభిప్రాయాలు తీసుకుని నియోజకవర్గాల పెంపు, పునర్విభజన ప్రాతిపదికను నిర్ణయించాలని సూచించారు.  2028 నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. అనవసరమైన గందరగోళానికి తెరలేపొద్దని సీఎం పేర్కొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *