కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ గురించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. తెలంగాణాలో రాహుల్ పర్యటన వేళ కాంగ్రెస్ ను గెలిపిస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు హామీ ఇచ్చి రెండున్నరేళ్లు అయ్యిందని గుర్తు చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ కోసం తెలంగాణకు వస్తున్న రాహుల్ గాంధీ గారు మీ హామీని నమ్మి శిక్ష అనుభవిస్తున్న మా నిరుద్యోగుల గోడు మీకు పట్టదా? అని కవిత ప్రశ్నించారు. మీ పార్టీ గద్దెనెక్కడానికి నిచ్చెనమెట్లుగా నిలిచిన యువత ఆశలు, ఆకాంక్షలను చిదిమేశారు.. ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే పోలీసులతో అణచి వేస్తున్నారని పేర్కొన్నారు. యూత్ డిక్లరేషన్ బోగస్ గా మారింది.జాబ్ క్యాలెండర్ పత్తా లేదు.. కాంగ్రెస్ అంటేనే మోసం.. వంచన అనే మాటను నిలబెట్టుకున్నారని విమర్శించారు. రాహుల్ జీ ఇది పోరాటాల పురిటిగడ్డ.. మీ హామీని నిలబెట్టుకోండి.. 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీని అమలు చేయించండని పేర్కొన్నారు.