పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి లకు స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి అని బీ.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమని ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక తీర్పు కాదు… అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించే ఉదాహరణని అన్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన పదవులను వ్యక్తిగత లాభాల కోసం మార్చుకుంటే, స్పీకర్ దానికి ముద్ర వేస్తే — ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ నిలుస్తాయి? అని ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని అన్న ఆయన తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని సరైన సమయంలో సమాధానం చెబుతారని పేర్కొన్నారు.