తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్యను కేటాయించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా సీఎం కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత 2016లో మొదటి క్యాడర్ రివ్యూ జరిగిందని, 2021లో జరగాల్సిన క్యాడర్ రివ్యూ చాలా ఆలస్యంగా 2025లో జరిగిందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ గుర్తుచేశారు. ఆ సమయంలోనూ కేవలం ఏడుగురు ఐపీఎస్ అధికారులను మాత్రమే తెలంగాణకు కేటాయించారని తెలిపారు. దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం సైబర్ నేరాలు, డ్రగ్స్, వైట్ కాలర్ నేరాలు సహా ఇతర అనేక ఆధునిక సవాళ్లను ఎదుర్కొంటోందని వివరించారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ, ఫ్యూచర్ సిటీ కమిషనర్, హైదరాబాద్ నగరంలో భారీగా పెరుగుతున్న పాపులేషన్ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని తెలిపారు. మూడో క్యాడర్ రివ్యూను నిర్దేశిత 2026 సంవత్సరంలోనే చేపట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 83 ఐపీఎస్ అధికారులు రాష్ట్రంలో ఉన్నారని, ఆ సంఖ్యను 103కు పెంచాలని కోరారు. ఈ భేటీలో ఇటీవల మావోయిస్టు అగ్ర నాయకుల లొంగుబాటు, వారి పునరావాసం అంశాలు చర్చించారు. గత రెండేళ్లలో తెలంగాణ పోలీసింగ్ లో గణనీయమైన మార్పులు వచ్చాయని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో 591 మంది మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసిన అంశాన్ని వివరించారు. ఇటీవల కాలంలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు కూడా సాధారణ జీవితం గడిపేందుకు ముందుకు వచ్చారని, వారికి నిబంధనల ప్రకారం అందజేస్తున్న పరిహారం, పునరావాసం విషయాలను కేంద్ర మంత్రికి అమిత్ షాకు సీఎం రేవంత్ తెలిపారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి సహకరించాలని కూడా కోరారు.