‘పదేళ్ల పాలన’ – ‘నేనే ముఖ్యమంత్రి’

Spread the love

Telangana CM Revanth Reddy: తెలంగాణలో అధికారంలోకి వచ్చినా..,కాంగ్రెస్ పార్టీకి అంతర్గత కుమ్ములాటల బెడద తప్పడం లేదా?.ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై స్వంత పార్టీ నేతలే ఎక్కు పెట్టారా?..తాజాగా ‘పదేళ్ల పాలన’-‘నేనే ముఖ్యమంత్రి’ అంటూ కొల్లాపూర్ సభలో సీఎం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ లో ‘లుకలుక’ లను బయటపడేలా చేసిందా?.మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి “X” వేదికగా సీఎం పై చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయా.!అంటే అవుననే.. తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.. కాంగ్రెస్ లో వర్గపోరు బహిరంగం అయ్యిందా?.అయినా అధిష్టానం మౌనం వెనుక ఉన్న మర్మమేంటి?

ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ‘పదేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది..నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను’ అంటూ కొల్లాపూర్ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ‘X’ వేదికగా ఆయన చేసిన పోస్టులు కాంగ్రెస్ లో తీవ్ర కలకలం రేపాయి. కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరూ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పడం ప్రజాస్వామ్యం కాదు.పార్టీలో నికార్సయిన కార్యకర్తలు,నాయకులు దీన్ని అంగీకరించరు,” అంటూ రాజగోపాల్ రెడ్డి పరోక్షంగా రేవంత్ ను టార్గెట్ చేశారు.ఇది అధిష్టానం నిర్ణయాలను,పార్టీ సంప్రదాయాలను ప్రశ్నించినట్లుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.రాజగోపాల్ రెడ్డి కి మంత్రి రాకపోవడమే ఈ దిక్కార స్వరానికి కారణమని విశ్లేషకులు అంటున్నారు. Telangana CM Revanth Reddy.

‘రాజగోపాల్ రెడ్డి – సీఎం రేవంత్ పై చేసిన మర్మ గర్భ వ్యాఖ్యలు కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం’పై మరోసారి చర్చకు దారితీశాయి.విపక్షాలు, ముఖ్యంగా బిఆరెస్,బీజేపీ లు కాంగ్రెస్ కు పక్కన శత్రువులు అవసరం లేదని, అధిష్టానమే పెద్ద శత్రువు అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. “అధిష్టానం నాయకులను ఎదగనివ్వకుండా సమాంతరంగా మరొకరిని ప్రోత్సహించడం కాంగ్రెస్ పార్టీ నైజం” అంటూ కొత్త రాగం ఎత్తుకున్నాయి.ఓ అడుగు ముందుకేసి రాజస్థాన్ (గెహ్లాట్ vs పైలట్), మధ్యప్రదేశ్ (కమల్ నాథ్ vs సింధియా), కర్ణాటక (సిద్దరామయ్య vs డీకే శివకుమార్) రాష్ట్రాల నేతల మధ్య వివాదాలను ఉదాహరణగా చూపుతున్నారు.ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం కర్ణాటక అంతర్గత వివాదంపై ‘అధిష్టానం చూసుకుంటుంది’ అనడం పార్టీలోని బలహీనతను చాటిచెబుతోందని ఎద్దేవా చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి సీఎం కాకముందు టీపీసీసీ అధ్యక్షుడిగా ‘ముఖ్యమంత్రి అభ్యర్థిని అధిష్టానం నిర్ణయిస్తుంది’అని చెప్పారు.కానీ ఇప్పుడు, సీఎం అయ్యాక ‘పదేళ్లు నేనే’ అని బహిరంగంగా ప్రకటించడంపై పార్టీ క్యాడర్ లో అనేక అనుమానాలు రేకేత్తుతున్నాయి.ఇంత ధైర్యం వెనుక అధిష్టానం నుంచి ఎలాంటి హామీ పొంది ఉండొచ్చనే చర్చ నడుస్తోంది.అయితే, కాంగ్రెస్ చరిత్రలో సీఎంలు పూర్తికాలం కొనసాగిన దాఖలాలు తక్కువ. దివంగత వై.ఎస్. రాజశేఖర రెడ్డి వంటి బలమైన నేత సైతం మళ్ళీ సీఎం కావడానికి ప్రయత్నాలు చేశారని, అలాంటిది రేవంత్ రెడ్డి వంటి ‘వేరే పార్టీ నుండి వచ్చిన’ నేత, పరిపాలనపై అసంతృప్తి పెరుగుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని సీనియర్లు తెగ చర్చిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి X పోస్టులు, వాటి వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఇప్పుడు కాంగ్రెస్ లో మరింత చిచ్చు పెడుతున్నాయి.గతంలో పార్టీ మారడం, తిరిగి రావడం, మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం వంటి పరిణామాల పరంపరను ‘బిఆరెస్’ ప్రస్తావిస్తూ, “క్రమశిక్షణ లేని పార్టీ కాంగ్రెస్. కుర్చీ కోసం కొట్లాటలకు కేర్ ఆఫ్ అడ్రస్,” అంటూ విమర్శలతో విరుచుకుపడుతోంది. కాంగ్రెస్ లోని అంతర్గత విభేదాలు, బలమైన నాయకుల మధ్య పోటీ.. ఇది అధికార పార్టీకి తలనొప్పిగా మారడమే కాదు, ప్రతిపక్షాలకు కొత్త అస్త్రాలను అందిస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ లో ‘రేవంత్ రెడ్డి’ వర్సెస్ ‘కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి’ ఎపిసోడ్, X వేదికగా చెలరేగిన మాటల యుద్ధం.. పార్టీలో అగ్ర నాయకత్వం మధ్య అంతరం స్పష్టంగా చూపిస్తోంది. అయితే అధిష్టానం మౌనం వహించడమే దీనికి ఆజ్యం పోస్తుందా? లేక ఏదైనా వ్యూహాత్మక మౌనమా? రాబోయే రోజుల్లో ఈ అంతర్గత పోరు తెలంగాణ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి.

Also Read: https://mega9tv.com/telangana/what-are-the-telangana-bjp-issues-that-have-become-a-headache-for-the-bjp-high-command/