
తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఆ మంత్రి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ, తన సొంత జిల్లాలోని ఆ నియోజకవర్గంలో మాత్రం ఇప్పటివరకు ఆయన అడుగపెట్టలేదట.కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లు ఉంది ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల పరిస్థితి. దీంతో ఆ నియోజకవర్గంలో ఆ మంత్రిని నమ్ముకున్న క్యాడర్ నాయకులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట…ఇంతకు అది ఏ జిల్లా..ఆ మంత్రి ఎవరు? ఇప్పుడు చూద్దాం.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుండి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు..భట్టి నాలుగు దఫాలుగా ఈప్రాంతంలో గెలుస్తూ నియోజకవర్గంపై మంచి పట్టుసాధించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుండి మధిర ప్రజలు ఆయనకు అండగా నిలబడ్డారు. జిల్లా అంతటా క్యాడర్ ఉన్నట్లే మధిరలో కూడా పొంగులేటికి క్యాడర్ ఉంది. అయితే ఆయన కాంగ్రెస్ గూటికి చేరడం పార్టీ అధికారంలోకి రావడం.. మంత్రి అవడం చకచకజరిగిపోయాయి. మంత్రి హోదాలో పొంగులేటి ఖమ్మం ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అటు ప్రవేటు కార్యక్రమాలలో పాల్గొంటూనే ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలకు చురుగ్గా హాజరైవుతున్నారు. అయితే మధిర నియోజకవర్గం వైపు మాత్రం కన్నెత్తి చూడడం లేదన్నా ప్రచారం సాగుతుంది.
అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలో ఏదో అడపాదడపాగా ఒకటి రెండుసార్లు మాత్రమే పొంగులేటి మధిరలో పర్యటించారు. కాంగ్రెస్ లో పొంగులేటి చేరిన సమయంలో భట్టి విక్రమార్క ఆయనకు ఓ షరతు పెట్టారని టాక్ వినిపిస్తుంది. తన నియోజకవర్గంలో పొంగులేటి పర్యటనలు ఉండకూడదని.. తన మార్క్ తప్ప మరొకరి ప్రమేయం అక్కడ అవసరం లేదని ఆదిష్టానం వద్ద పర్మిషన్ తీసుకున్నట్లు చర్చ నడుస్తుంది. అందుకే పొంగులేటి మధిరకి రావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పొంగులేటి రాజకీయ ప్రవేశం నుండి ఆయన వెంట ఉన్న నేతలంతా ప్రస్తుతం మధిరలో దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి శిబిరం నేతలంతా భట్టి గెలుపులో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం మధిరలో పొంగులేటి శిబిరం నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.. కనీసం పార్టీ కార్యక్రమాలకు వారికి సమాచారం ఇవ్వడం లేదంట.. ఇక అభివృద్ధి కార్యక్రమాలకు వారికి ఆహ్వానమే అందడం లేదు. భట్టితో వేదిక పంచుకునే అవకాశామే లేకుండా పోతుంది.. ఎప్పటి నుండో భట్టి వెంట ఉన్నవారికే అన్ని రకాలుగా ప్రాధాన్యత కల్పిస్తున్నారని పొంగులేటి అనుచరులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నా విమర్శలు వస్తున్నాయి.. దీంతో పొంగులేటి అనుచరులంతా భట్టిపై గరంగరంగా ఉన్నట్లు సమాచారం.
మంత్రిగా ప్రమాణం చేసిన మరుక్షణమే తన వారికి పదవులు కూడా ఇస్తానన్న పొంగులేటి తన హామిని విస్మరించరాన్న టాక్ ఉంది.. పదవుల సంగతి పక్కన పెడితే కనీసం తాము పార్టీలో ఉన్నట్లు అయినా గుర్తించండి అని వారు మొరపెట్టుకుంటున్నారంట… మధిరలో జరుగుతున్న విషయాలను పొంగులేటి దృష్టికి తీసుకెళ్లినా మౌనంతోనే ఆయన సమాధానం చెబుతున్నారని తెలుస్తుంది. ఇక తమకు ఓపిక లేదని తమకు ఇచ్చిన హామిల మేరకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. సమయం ఉన్నప్పుడు మధిరలో పొంగులేటి పర్యటించాలని అనుచరులు కోరుతున్నారు. అలా అయిన తమకు గుర్తింపు ఉంటుందని వారు భావిస్తున్నారు.
తెలంగాణలో అన్ని ప్రాంతాలలో పర్యటిస్తున్నా పొంగులేటి.. మధిరలో మాత్రం పర్యటించకపోవడం వెనుక ఆదిష్టానం ఆదేశాలు ఉన్నట్లు సమాచారం. అయితే తన అనుచరులకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా పొంగులేటి ఆదిష్టానం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇంతకాలం పొంగులేటి వెంటే ఉన్నామని ఏదో ఒక సందర్బంలో ఆయన తమకు న్యాయం చేస్తాడన్న నమ్మకం ఉందని వారు ధీమాతో ఉన్నారు.. ఏది ఎమైనా మధిరలో జరుగుతున్న పరిణామాలను పార్టీ ఆదిష్టానం చక్కదిద్దకుంటే నష్టం జరిగే అవకాశం స్పష్టంగా ఉంది. చూడాలి మరి మధిర పాలిట్రిక్స్ ఎలా ఉంటాయో.