స్థానిక సంస్థల్లో మీరు వేసిన అడుగు చాలా పెద్దది:తెలంగాణ శ్రేణులతో పవన్

Spread the love

ఇటీవల తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున సర్పంచులు, వార్డు మెంబర్లుగా విజయం సాధించిన అభ్యర్ధులు, బరిలోకి దిగిన అభ్యర్ధులతో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు కొత్త నాయకత్వం కావాలి. పంచాయతీల నుంచి మన అభివృద్ధి ప్రస్థానం మొదలుపెడదాం. సర్పంచులు, వార్డు మెంబర్లుగా విజయం సాధించి.. మీరంతా చాలా పెద్ద అడుగు వేశారు. ఎంత పెద్ద ప్రయాణం అయినా ఒక్క అడుగుతోనే మొదలు పెడతాం. ఈ రోజు మీరు వేసిన అడుగు సరికొత్త మార్పుకు నాంది కావాలని కోరుకుంటున్నానని ఈ సందర్భంగా పవన్ అన్నారు. పోటీ చేసిన సంఖ్యలో 50 శాతం విజయం సాధించడం అభినందనీయమన్నారు. జనసేన పార్టీ మద్దతుదారులుగా విజయం సాధించిన ప్రతి ఒక్కరూ మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. నేను పార్టీ పెట్టడానికి నాలో చైతన్యం నింపింది, నాకు ధైర్యం ఇచ్చింది తెలంగాణ నేల. నాకు తెలంగాణ పోరాట స్ఫూర్తి అంటే చాలా ఇష్టం. నేను ఇక్కడి నుంచి ఏమీ ఆశించడం లేదు. మన దేశం, మన తెలుగు నేలకు జనసేన పార్టీ తరఫున చేయగలిగిన సేవ కలసికట్టుగా చేద్దాం. తెలంగాణలో పుట్టిన పార్టీ మనది. ఇక్కడ ప్రజలకు అండగా నిలుద్దాం. తెలుగు ప్రజల ఐక్యత కోసం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. 

తెలంగాణకు బలమైన యువ నాయకత్వం అవసరం ఉంది. మీ స్థాయి, మీ ప్రాంతాన్ని బట్టి పోరాటం చేయండి. మీరంతా సైద్ధాంతిక బలంతో సహజంగా ఎదగాలని కోరుకుంటున్నాను. ఒక సిద్ధాంతం ఆధారంగా ఎదిగిన వారిని విభేదించడం కష్టం. అది నేను ప్రాక్టికల్ గా చేసి చూపాను. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు విభిన్నంగా ఉంటాయి. తెలంగాణ నేల నాకు పోరాట శక్తి ఇచ్చింది. రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకున్నాను అంటే తెలంగాణ అమరవీరులు ఇచ్చిన స్ఫూర్తే కారణం. రజాకార్ల మీద వారు చేసిన సుదీర్ఘ పోరాటం నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను. సమయం ఇవ్వగలిగితే రాజకీయాల్లో మంచి స్థాయికి చేరుకోవచ్చు. 53 మంది విజయం సాధించారు. దశాబ్ద కాలం తర్వాత తెలంగాణలో దక్కిన విజయం ఇది. మీ అందరికీ ఆ కొండగట్టు ఆంజనేయస్వామి ఆశీస్సులు ఉండాలి. అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలూ క్షేమంగా ఉండాలి. తెలుగు రాష్ట్రాల ప్రజల ఐక్యత కోసం కలసి పనిచేద్దామని అన్నారు. నేడు కొండగట్టు ఆలయాన్ని సందర్శించిన పవన్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.