ఖమ్మం నగరం వెలుగుమట్ల వినోబా నగర్ లో అప్పులు చేసి పేదలు నిర్మించుకున్న ఇళ్లను, వేల మంది పోలీసుల పహారాలో కూల్చివేయడం అత్యంత హేయమైన చర్యని బీ.ఆర్.ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. దీనిని తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యమా? లేక పోలీస్ రాజ్యమా?నాలుగు జిల్లాల నుండి వేల మంది పోలీసులను మోహరించి, ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ఇళ్లను కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది, పేద ప్రజలు మీకేమైనా తీవ్రవాదుల్లా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని మీడియాను రాకుండా అడ్డుకుంటున్నారంటేనే.. మీరు చేస్తున్న అరాచకం లోకానికి తెలియకూడదనే మీ భయం అర్థమవుతోంది. చీకటి పనులు చేసేవారే మీడియాను చూసి భయపడతారని ఫైర్ అయ్యారు. మేము అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం అని నమ్మబలికిన సీఎం రేవంత్, తుమ్మల నాగేశ్వరరావు.. నేడు ఉన్న ఇళ్లను కూలగొట్టి పేదలను నడిరోడ్డుపై నిలబెడుతున్నారని ఆక్షేపించారు. ఓటు వేసినందుకు మాకు తగిన శాస్తి జరిగింది అని బాధితులు రోదిస్తుంటే.. గుండె తరుక్కు పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంతో కష్టపడి, రూపాయి రూపాయి పోగేసి కట్టుకున్న ఇళ్లను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చడం అమానుషం. బాధితుల ఆవేదన రేపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దహించి వేయడం ఖాయం. వెంటనే ఈ అక్రమ కూల్చివేతలను ఆపాలి. పోలీసులు వెనక్కి వెళ్లాలి. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పేదలపై కర్రలు ఎత్తడం మానేసి, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని సూచించారు. పేదల గూడు చెదిరితే.. మీ అధికారం గద్దెలు అంతే వేగంగా కూలుతాయని హెచ్చరించారు. వెంటనే కూల్చివేతలు ఆపాలి. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి. నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇంచు భూమి కూడా కదిలించడానికి వీల్లేదని డిమాండ్ చేశారు. పేదల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. ఖమ్మం బిడ్డల కన్నీళ్లకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.