
ఆ నియోజక వర్గంలో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఒంటరయ్యారా..? ఆ పార్టీకి జిల్లాలోనే పెద్ద దిక్కుగా ఉన్న ఆ మాజీ మంత్రికి ఈ మాజీ ఎమ్మెల్యే కు మధ్య సఖ్యత చెడిందా? అంతర్గతంగా గ్రూప్ వార్ జరుగుతోందా? గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి వచ్చేందుకు అన్ని తానే చూసుకున్న మాజీ మంత్రి ఇప్పుడు తనను నమ్ముకున్న మాజీ ఎమ్మెల్యే ను ఎందుకు దూరం పెట్టారు? రోజు రోజుకు తన నియోజక వర్గంలో ఆ మాజీ ఎమ్మెల్యేకు సెకండ్ క్యాడర్ ను దూరం చేసే ప్రయత్నం జరుగుతోందా? ఇంతకీ ఎవరా నేతలు? ఎక్కడ ఆ నియోజక వర్గం.. లెట్స్ వాచ్ ది స్టోరీ
ఉమ్మడి నల్గొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై సొంత పార్టీ నేతలే ‘నారాజ’ అవుతున్నారట. ఆయన తీరుతో విసిగిపోయిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ అధినేతకు ఫిర్యాదు చేసినట్లు గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి మధ్య వార్ ఉప్పు నిప్పులా మారిందట! నియోజక వర్గంలో తనను కాదని మరో వర్గానికి జగదీష్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారని చిరుమర్తి లింగయ్య ప్రధాన ఆరోపణ. దీంతో జగదీష్ రెడ్డి వ్యవహార శైలిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చిరుమర్తి లింగయ్య ఫిర్యాదు చేశారని తెలిసింది.అంతేకాక మాజీ మంత్రి హరీష్ రావుకు తన బాధలు చెప్పుకున్నట్లు పార్టీలోనే కొంతమంది నేతలు చర్చించుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో జగదీష్ రెడ్డిని కాదని బిఆర్ఎస్ పార్టీలో ఏది జరగదని ప్రచారం జరుగుతుంది. చిరుమర్తి లింగయ్య పార్టీ హై కమాండ్ కు ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవలే గులాబీ పార్టీ సిల్వర్ జూబ్లీ సందర్భంగా వరంగ ల్ లో భారీ బహిరంగ సభను నిర్వహించారు. అయితే ఈ సభకు ప్రజలను తరలించేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజక వర్గాల మాజీ ఎమ్మెల్యేల నేతృత్వంలో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఆ సమావేశాలకు మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హాజరవుతూ వచ్చారు. కానీ నకరేకల్ నియోజక వర్గంలో మాత్రం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నియోజక వర్గ వ్యాప్తంగా నిర్వహించిన సమావేశాలకు జగదీష్ రెడ్డిని ఆహ్వానించకపోవడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందని టాక్ వినిపిస్తోంది. నకరేకల్, కట్టంగూర్, నార్కట్పల్లి, చిట్యాల, రామన్నపేట మండలాల్లో పార్టీ సన్నాహక సమావేశాలను మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఒక్కరే నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజక వర్గాలకు హాజరైన జగదీష్ రెడ్డి నకర్రేకల్ నియోజక వర్గం పరిధిలో సమావేశాలకు హాజరు కాకపోవడం పట్ల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. చిరుమర్తి లింగయ్య జగదీష్ రెడ్డిని విమర్శించాడని ఓ మాజీ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి చెప్పడంతో లింగయ్యపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కక్ష పెంచుకొని లింగయ్యను బీఆర్ఎస్ లో జీరో చేయాలని చూస్తున్నాడని చిరుమర్తి లింగయ్య వర్గం ఆరోపిస్తుంది.
అయితే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.. చిరుమర్తి లింగయ్యని కావాలని ఒంటరి చేశారని చిరుమర్తి లింగయ్య వర్గం ఆరోపిస్తోంది. అయితే పార్టీ అధినేతకు విధేయుడిగా ఉండే జగదీష్ రెడ్డిని కాదని ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ విషయంలో ఏ నిర్ణయం తీసుకోరు అనేది ఆ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకి తెలిసిన సత్యం. కానీ జగదీష్ రెడ్డిని చిరుమర్తి విమర్శించడంతోనే వీరిద్దరి మధ్య వైరం ఏర్పడిందని టాక్ వినిపిస్తోంది. అంతేకాక చిరుమర్తి లింగయ్యను పార్టీలోకి తీసుకొచ్చిన జగదీష్ రెడ్డి ఇప్పుడు ఆయనను పక్కకు పెట్టారని ప్రచారం జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు జగదీష్ రెడ్డితో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నఈ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు తన నియోజక వర్గం దాటి ఎక్కడికి వెళ్లడం లేదు సరికదా ఏదైనా కార్యక్రమాలు ఉంటే వాటకి మాజీ మంత్రికి ఆహ్వానం పంపడం లేదన్నది టాక్. దీనికి తోడు జగదీష్ రెడ్డి పేరు ఎత్తితే చిలుమర్తి లింగయ్య అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారని నియోజక వర్గ వ్యాప్తంగా సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి నకరేకల ఎమ్మెల్యే గా చిరుమర్తి లింగయ్య గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న వేముల వీరేశం ఓడిపోయారు. అయితే చిరుమర్తి లింగయ్యను బిఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకునే విషయంలో వేముల వీరేసం అభ్యంతరం వ్యక్తం చేసిన పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు జగదీష్ రెడ్డి నేతృత్వంలో చిరుమర్తి లింగయ్య తిరిగి బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుండే నకరేకల్ నియోజక వర్గంలో బిఆర్ఎస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. అప్పుడు చిరుమర్తి లింగయ్యకు జగదీష్ రెడ్డి సపోర్ట్ ఉండేది కానీ ప్రస్తుతం చిరుమర్తి లింగయ్యకు జగదీష్ రెడ్డికి మధ్య అస్సలు పొసగడం లేదు.అయితే 2023 లో అనూహ్యంగా వేముల వీరేసం కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలుపొందారు . అయితే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాత్రం మొన్నటి వరకు కూడా చిరుమర్తి లింగయ్యకు సపోర్ట్ గా ఉండేవారు. కానీ ఈ మధ్య మాత్రం చిరుమర్తి లింగయ్యను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దూరం పెట్టారుఒకవైపు రాష్ట్రంలో అధికారం కోల్పోయి ఉన్న పరిస్థితుల్లో పార్టీలో ఇలా వర్గపోరు రాజుకోవడం పట్ల పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం మీద మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బిఆర్ఎస్ లో ఒంటరయ్యారనే ప్రచారంతో పార్టీ క్యాడర్లో అయోమయం నెలకొంది. ఉమ్మడి జిల్లాలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలతో కూడా లింగయ్య దూరంగా ఉంటున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. చిరుమర్తి లింగయను ఒంటరి చేసి మరో వర్గాన్ని నకరేకల్ నియోజక వర్గంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రోత్సహించడం దేనికి దారితీస్తుందో అన్న టాక్ నడుస్తోంది. పార్టీ అధినాయకత్వం మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే మధ్య ఏర్పడ్డ వైరాన్ని ఏ విధంగా పరిష్కరిస్తుందో వేచి చూడాల్సిందే.