తెలుగు సినీ పరిశ్రమలో మాస్ సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన దర్శకుల్లో బోయపాటి శ్రీను పేరు ముందువరుసలో ఉంటుంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, భారీ డైలాగులు ఎమోషన్స్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక క్రేజ్ ఉంది. రెండు దశాబ్దాలకు పైగా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న బోయపాటి శ్రీను, తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు తిరుపతిలో ప్రసిద్ధి చెందిన తాతయ్య గుంట గంగమ్మ అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తిరుపతి ప్రాంతంతో తనకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందని బోయపాటి తెలిపారు. శ్రీవారి ఆశీస్సుల వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఏ కొత్త పని ప్రారంభించాలన్నా ముందుగా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుని, ఆశీస్సులు తీసుకున్న తర్వాతే మొదలు పెడతానని చెప్పారు. తన జీవితంలో తిరుమలకి ఎంత ప్రాధాన్యం ఉందో ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది.
ప్రకృతి అందాల నిలయం
తిరుపతి అంటే కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదని, అది ప్రకృతి అందాల నిలయం కూడా అని బోయపాటి అభిప్రాయపడ్డారు. శేషాచల కొండలు, పచ్చని అడవులు, జలపాతాలు, పురాతన దేవాలయాలు, నదులు ఇలా సినిమా షూటింగులకు అవసరమైన ప్రతి రకమైన లొకేషన్ ఇక్కడ ఉందన్నారు. ముఖ్యంగా తలకోన వాటర్ ఫాల్స్, శ్రీకాళహస్తి, పులిగుండు, స్వర్ణముఖి నది పరిసరాలు, గుడిమల్లం వంటి ప్రాంతాలు షూటింగ్ లకు ఎంతో అనువుగా ఉంటాయని చెప్పారు. ఒకప్పుడు ఈ ప్రాంతాల్లో తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల సినిమాల షూటింగులు కూడా ఎక్కువగా జరిగేవని గుర్తుచేశారు.*పరిస్థితి పూర్తిగా మారిపోయింది*అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆయన తెలిపారు. గతంలో సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిసినా కొద్దిమంది మాత్రమే వచ్చేవారని, ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ల కారణంగా పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. ఒక షూటింగ్ జరుగుతుందనే సమాచారం బయటకు వస్తే చాలు, వందల సంఖ్యలో జనం అక్కడికి చేరుకుంటున్నారని చెప్పారు. దీంతో షూటింగ్ నిర్వహించడం చాలా కష్టమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటం, అందులో అత్యాధునిక కెమెరాలు ఉండటం కూడా సినీ పరిశ్రమకు పెద్ద సవాలుగా మారిందన్నారు. ఎక్కడో దూరంలో ఉన్న భవనాలపై నుంచి కూడా జూమ్ చేసి షూటింగ్ సన్నివేశాలు, హీరోల గెటప్స్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారని చెప్పారు. భారీ బడ్జెట్తో, ఎంతో కష్టపడి తీసే సినిమాలకు ఇది చాలా నష్టం కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సినిమాలోని ముఖ్యమైన సన్నివేశం లేదా హీరో లుక్ ముందుగానే లీకైతే, ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తి తగ్గిపోతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన అఖండ సినిమా గురించి కూడా ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఆ చిత్రంలోని క్లైమాక్స్ సన్నివేశాలను మొదట పులిగుండు ప్రాంతంలో చిత్రీకరించాలని భావించారట. లొకేషన్ పరిశీలన కోసం అక్కడికి వెళ్లగానే వందలాది మంది అభిమానులు తన చుట్టూ చేరిపోయారని చెప్పారు. ఇక నందమూరి బాలకృష్ణ తో అక్కడ షూటింగ్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చన్నారు. ముఖ్యంగా సినిమాలో బాలకృష్ణ చేసిన అఘోరా పాత్ర గెటప్ బయటకు లీక్ అయ్యే ప్రమాదం ఉండటంతో చివరికి షూటింగ్ లొకేషన్ మార్చి తమిళనాడులోని సెంజి కోటలో చిత్రీకరించాల్సి వచ్చిందని వెల్లడించారు.
లోకేషన్స్ అద్భుతం
బోయపాటి మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో ఉన్న లొకేషన్లకు ఇంకా సరైన ప్రాచుర్యం రావాల్సి ఉందన్నారు. జిల్లాలో సముద్ర తీర ప్రాంతాలు, పులికాట్ సరస్సు, జలపాతాలు, అడవులు, పురాతన ఆలయాలు ఇలా ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయని చెప్పారు. వీటిని సరైన రీతిలో ప్రోత్సహిస్తే భవిష్యత్తులో కొత్త దర్శకులు, నిర్మాతలు తప్పకుండా ఇక్కడికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం పెద్ద హీరోల సినిమాలే కాదు, కొత్త దర్శకుల సినిమాలు కూడా ఈ ప్రాంతాల్లో షూట్ అయ్యే అవకాశం ఉందన్నారు. తిరుమల గురించి మాట్లాడినప్పుడు మాత్రం బోయపాటి మాటల్లో మరింత భక్తి కనిపించింది. తిరుమల ప్రాంతంలో అడుగుపెడితేనే మనసుకు ప్రశాంతత కలుగుతుందని ఆయన అన్నారు. అక్కడి చల్లటి గాలి, అడవుల సువాసనలు, ఆధ్యాత్మిక వాతావరణం మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయని భావోద్వేగంగా చెప్పారు. ముఖ్యంగా శ్రీవారి దర్శనం తర్వాత కలిగే అనుభూతిని మాటల్లో చెప్పలేమన్నారు. అక్కడ లభించే ప్రసాదాల రుచి కూడా ఎంతో ప్రత్యేకమని తెలిపారు.తన వ్యక్తిగత జీవితంతో కూడా తిరుమలకి ప్రత్యేకమైన అనుబంధం ఉందని ఆయన చెప్పారు. తన వివాహం కూడా తిరుమలలోని వెయ్యికాళ్ల మండపంలో జరిగిందని గుర్తుచేసుకున్నారు. అందుకే తిరుమలంటే తనకు మరింత భక్తి, మరింత ప్రేమ అని చెప్పారు. ఇక తిరుపతి గంగమ్మ జాతర గురించి మాట్లాడుతూ బోయపాటి ఎంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి సంవత్సరం వీలైనంత వరకు గంగమ్మ జాతరకు హాజరవుతానని చెప్పారు. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుందని తెలిపారు. గంగమ్మ జాతరలో ఉండే ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ పూర్తిగా భిన్నంగా ఉంటాయని చెప్పారు. తన సినిమాలైన భద్ర, లెజెండ్, సరైనోడు చిత్రాల సమయంలో కూడా అమ్మవారిని దర్శించుకున్నట్లు గుర్తు చేసుకున్నారు.ఇకపై సినిమాలకు సంబంధించిన కథల చర్చలు కూడా తిరుపతిలోనే నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు బోయపాటి వెల్లడించారు. తిరుపతిలో ఉండే ఆధ్యాత్మిక శక్తి తనకు కొత్త ఆలోచనలు, కొత్త ఉత్సాహం ఇస్తుందని చెప్పారు. అలాగే కాణిపాకం, గుడిమల్లం వంటి ప్రాంతాల్లోని దేవాలయాలు కూడా తనకు ఎంతో ఇష్టమన్నారు. ముఖ్యంగా గుడిమల్లంలోని పరశురామేశ్వర ఆలయంలోకి అడుగుపెట్టగానే ఒక అద్భుతమైన శక్తి అనుభూతి కలుగుతుందని చెప్పారు.