నటుడిగా రాణిస్తూ ప్రేక్షకులను తన హాస్యంతో నవ్వించి అటు దర్శకుడిగా కూడా బలగం సినిమాతో భారీ స్థాయి విజయాన్ని అందుకున్నారు వేణు ఎల్దండి. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఎల్లమ్మ’. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో కథానాయికగా అందాల తార మృణాల్ ఠాకూర్ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆమె ‘డెకాయిట్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇదివరకు రకరకాల వార్తలు ప్రచారంలో నిలిచాయి. దేవిశ్రీకి జోడీగా సాయి పల్లవి, కీర్తి సురేశ్ నటిస్తారని ఊహాగానాలు వినిపించాయి. ఇక ఇప్పుడు తెర పైకి మృణాల్ పేరు వచ్చింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన అయితే మూవీ టీమ్ నుండి రాలేదు. ప్రస్తుతానికి ఇవి సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు మాత్రమే. ఒకవేళ ఆమె ఈ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయి. ముందుగా ‘ఎల్లమ్మ’లో హీరోలుగా కొందరి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ చివరికి ఈ పాత్ర కోసం దేవి శ్రీ ప్రసాద్ ను ఎంపిక చేయడం గమనార్హం. ఈ సినిమాకు దేవిశ్రీనే సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతికి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఇందులోని కథానాయికకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేవిశ్రీ నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సంగీత దర్శకుడు నటుడైతే ఎలా ఉంటుందని ఆసక్తిగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆయన ఇప్పటి వరకు తన సంగీతంతో ఉర్రుతలూగించారు. ఇక నటనతో కూడా మెప్పించనున్నారని అనుకుంటున్నారు. తనట్యూన్స్ తో థియేటర్లను ఊపేసిన ఆయన, ఇప్పుడు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.