భారత్ తన వంటగ్యాస్ అవసరాల కోసం ప్రధానంగా ఆధారపడేది ఖతార్ మీద. గత 20 ఏళ్లుగా నిరంతరాయంగా మనకు ఎల్పీజీని అందిస్తున్న ఆ దేశంలో పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా మారింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కాస్తా గ్యాస్ ప్రొడక్షన్ క్షేత్రాల మీదకు మళ్లింది. ఖతార్‌లోని కీలకమైన గ్యాస్ ఉత్పత్తి కేంద్రాల మీద ఎటాక్స్ జరగడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. ఖతార్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం.. ధ్వంసమైన ఈ క్షేత్రాలను పునరుద్ధరించడానికి, ప్రొడక్షన్ మళ్లీ సాధారణ స్థితికి రావడానికి కనీసం 5 ఏళ్లు పడుతుంది. ఇది చిన్న విషయం కాదు. అంటే రాబోయే ఐదేళ్ల కాలం పాటు గ్యాస్ సరఫరాలో కొంతమేరకు ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. ఇప్పటికే హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్ దొరక్క మూతపడుతుంటే.. తదుపరి వంతు సామాన్యుడి ఇల్లే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనకు రావలసిన గ్యాస్ సముద్రం మధ్యలోనే ఆగిపోయింది. దీనికి కారణం హర్మూజ్ జలసంధి . ప్రపంచ చమురు రవాణాకు జీవనాడి వంటిది. ప్రస్తుతం ఇక్కడ ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
మన చుట్టూత ఉన్న పరిస్థితినే గమనిస్తే ఇప్పటికే హైదరాబాద్ లోని ప్రముఖ రెస్టారెంట్లు తమ మెనూలను తగ్గించేశాయి. గ్యాస్ సిలిండర్ల సప్లై లేకపోవడంతో చాలా చిన్న హోటళ్లు మూతపడ్డాయి. దీనివల్ల వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. సామాన్యుడు గ్యాస్ బుక్ చేస్తే వారం పది రోజులకు కూడా డెలివరీ అవ్వడం లేదు. దీంతో బ్లాక్ మార్కెట్ రాజ్యమేలుతోంది. ఒక్కో సిలిండర్‌పై రూ. 200 నుండి 300 అదనంగా వసూలు చేస్తున్నా, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు కొంటున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన ప్రధాని మోదీ యుద్ధాన్ని వెంటనే ఆపాలని అంతర్జాతీయ వేదికలపై గళమెత్తారు. భారత్ సాధారణంగా ఇలాంటి విషయాల్లో తటస్థంగా ఉంటుంది, కానీ మన గ్యాస్ అవసరాలు దెబ్బతినడంతో భారత్ కూడా గట్టిగానే స్పందిస్తోంది.
ఖతార్ మనకు అత్యంత కీలకమైన దేశం. మనకే కాదు ప్రపంచానికే కీలకం. ఎందుకంటే.. అక్కడ 20 ఏళ్లుగా ఎల్పీజీ గ్యాస్ ప్రొడక్షన్ జరుగుతోంది. మన దేశానికి ఎల్పీజీ గ్యాస్‌ని ఎక్కువగా పంపుతున్నది ఖతారే. అక్కడ ఎలాంటి సమస్య వచ్చిన మన ఇళ్లలో గ్యాస్ స్టవ్ వెలగదు. ఆల్రెడీ చూస్తున్నాం కదా.. హోటళ్లు, రెస్టారెంట్లూ మూసేస్తున్నారు. వాళ్లకు గ్యాస్ అస్సలు దొరకట్లేదు. నెక్ట్స్ లిస్టులో ఉన్నది ఇళ్లే. ఇళ్లకు ఇచ్చే గ్యాస్ సప్లై కూడా నిలిచిపోయే ప్రమాదం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం “ఆందోళన అవసరం లేదు.. గ్యాస్ సప్లైకి ఇబ్బంది లేదని చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితి అలా లేదు. దేశవ్యాప్తంగా ఇళ్లలో గ్యాస్ కోసం బుక్ చేసుకుంటే.. వారమైనా సిలిండర్ రావట్లేదు. కారణం.. విపరీతమైన కొరతే.
పెద్ద సమస్య హర్మూజ్ జలసంధిని మూసేయడం దగ్గర మొదలైంది. అక్కడ భారత్‌కి చెందిన 22 నౌకలు ఉన్నాయి. వాటిలో 6 ఎల్పీజీ గ్యాస్ కలిగివున్నాయి. వాటిని వదిలితే మనకు గ్యాస్ కొరత తగ్గుతుంది. కానీ.. వదిలే పరిస్థితి. ఇరాన్ మనతో తాపీగా మాట్లాడే స్థితిలో లేదు. ఆ దేశంపై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తూ.. ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి. దాంతో తిక్కరేగి.. ఆ దేశం కూడా.. చమురు, గ్యాస్ క్షేత్రాలపై దాడులు చేస్తోంది. ఇలా అక్కడ పూర్తి ఉద్రిక్త పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో మన కేంద్ర ప్రభుత్వం ఇరాన్‌తో చర్చలు జరుపుదామన్నా.. అటు నుంచి కూల్‌గా స్పందించే వీలు లేదు. దాంతో.. ఓడలు ముందుకు కదలట్లేదు. అందుకే మన ఇళ్లలో సమస్య పెద్దది కాబోతోంది.
హర్మూజ్‌కి తోడు.. ఇప్పుడు కొత్త సమస్య చమురు క్షేత్రాలు, గ్యాస్ ఉత్పత్తి క్షేత్రాలపై జరుగుతున్న దాడులు. అసలు గ్యాస్ ఉత్పత్తి అయ్యేదే అక్కడ. అలాంటి వాటిపై దాడి చేస్తే.. మరి గ్యాస్ ఉత్పత్తి ఆగిపోతుంది. అప్పుడు.. ప్రపంచ దేశాలకు గ్యాస్ సప్లై తగ్గిపోతుంది. ముఖ్యంగా మన ఇండియా.. గల్ఫ్ దేశాల్లోని ఖతార్, సౌదీ అరేబియా లాంటి దేశాల నుంచి ఎక్కువగా చమురు, గ్యాస్ దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు ఆ గ్యాసే ఉత్పత్తి కాకపోతే, ఇక ఇండియాకి గ్యాస్ వచ్చే పరిస్థితి ఉండదు. ఇదే ఆందోళన కలిగించే విషయం. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. “యుద్ధాలను వెంటనే ఆపాలన్నారు. ఆయన అంతలా కఠినంగా మాట్లాడారంటే దానికి కారణం.. గ్యాస్ కొరత పెరగబోతోంది కాబట్టే.
ఇటీవల శివాలిక్, నందాదేవి అనే రెండు నౌకలు.. ఎల్పీజీ గ్యాస్‌తో భారత్ చేరుకున్నాయి. కానీ మనకు గ్యాస్ లేదు. ఎందుకంటే.. ఆ వచ్చిన గ్యాస్ ఏమాత్రం సరిపోలేదు. జస్ట్ 3 రోజుల్లోనే అది అయిపోయింది. హోటళ్లు, హాస్పిటళ్ల లాంటి వాటికి దాన్ని సప్లై చేశారు. ఇప్పుడు మళ్లీ గ్యాస్ లేదు. కొత్తగా నౌకలు వచ్చేలా లేవు. ఇరాన్ ఎప్పుడు అనుమతిస్తుందో తెలియదు. పోనీ ఇతర దేశాల నుంచి గ్యాస్ వస్తుందా అంటే.. అది చాలా తక్కువ. మనకు ఎక్కువగా గ్యాస్ ఇచ్చేదే ఖతార్. ఇప్పుడు అక్కడ గ్యాస్ ఉత్పత్తికి పెను సవాలు ఉంది. ఇవన్నీ మనం గమనిస్తే, మనకు అర్థమయ్యేది ఒకటే. మన ఏపీ, తెలంగాణలో గ్యాస్ కొరత పెరిగే సంకేతాలు ఉన్నాయి.
ఇక త్వరలో వంటగ్యాస్ ధరలు మరింత పెరిగే సంకేతాలు ఉన్నాయి. ఇప్పటికే ఇళ్లలో వాడే సిలిండర్ ధర రూ.60 పెరిగింది. ఇంకా పెరగవచ్చు. ఎందుకంటే.. యుద్ధం తీవ్రత పెరిగింది. చమురు క్షేత్రాలపై దాడులు జరుగుతున్నాయి. తద్వారా చమురు ఉత్పత్తి తగ్గిపోతుంది. ఆల్రెడీ అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దాంతో ఇండియాకి వచ్చే చమురు, గ్యాస్ ధర పెరగవచ్చు. భారత్ LPG గ్యాస్ దిగుమతుల్లో 90శాతం మిడిల్ ఈస్ట్ నుంచే వస్తుంది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ కీలక ప్రకటన చేశారు. “ఇలాంటి దాడులు అనుమతించేవి కావు. వెంటనే ఆపాలి” అని స్పష్టం చేశారు. ఇది భారత్ తరపున విదేశాలకు ఇచ్చిన అధికారిక ప్రకటన. ఇప్పటివరకూ ఇండియా గల్ఫ్ యుద్ధం ఇంత తీవ్ర స్వరం వినిపించలేదు. ఇప్పుడు పరిస్థితులు దిగజారుతుంటే.. ఇక ఇండియా కూడా నోరు మెదపక తప్పలేదు. భారత్ ఏటా 33 మిలియన్ టన్నుల LPGని వాడుతుంది. ఇందులో దాదాపు 60% దిగుమతి చేసుకునేదే. ఇప్పుడు షిప్పింగ్ ఆగిపోయింది. దేశీయంగా రీఫైనరీలు ఉత్పత్తిని 25-30% పెంచాయి. కానీ డిమాండ్‌కు అది ఏమాత్రం సరిపోవడం లేదు. ప్రభుత్వం ఇళ్లకు ప్రాధాన్యం ఇచ్చి, కమర్షియల్ సప్లైను 20% తగ్గించేసింది. అయినా ఫలితం లేదు. హైదరాబాద్‌లో రెస్టారెంట్లు, హోటళ్లు ఇప్పటికే మెనూ కుదించాయి. కొన్ని మూతపడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లోని వీధుల్లో చాలా హోటళ్లను తెరవట్లేదు. అందులో పనిచేసే వారి ఉద్యోగాలు తాత్కాలికంగా పోయినట్లే. హోటల్ రంగం కుదేలైంది. ఇళ్లలో కూడా గ్యాస్ కొరత వస్తుండటంతో.. కొంతమంది బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్‌కి అదనంగా రూ.200-300 ఎక్కువ ఇచ్చి కొంటున్నారు. అది చట్టవిరుద్ధమే అయినా.. సిలిండర్ కొరతతో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేంద్రం ప్రజలకు ఏం చెప్పింది?: కేంద్రం “ఆందోళన చెందవద్దు. అనవసరంగా గ్యాస్ సిలిండర్‌ని బుక్ చెయ్యవద్దు. వీలైతే.. పైప్డ్ గ్యాస్ (PNG)కి మారండి” అని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ ప్రజలకు సందేశం ఇచ్చారు. బ్లాక్ మార్కెట్‌పై రైడ్లు జరుగుతున్నాయి అని ఆమె చెబుతున్నారు. అంతా ఇరాన్, అమెరికా యుద్ధం ఆపితేనే.. గ్యాస్ సమస్యలు తీరతాయి. లేదంటే.. మనకు కొత్తగా గ్యాస్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండాలంటే యుద్ధం ఆగడమే ఏకైక మార్గం.