మధ్యప్రాచ్యంలో రగులుతున్న మంటలు..యుద్ధం ఏం ఇస్తుంది?

Spread the love

మిడిల్ ఈస్ట్ ప్రాంతం ప్రపంచానికి  ఇంధనాన్ని ఇచ్చే కీలక ప్రాంతం అయితే ఇప్పుడు అక్కడ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ – ఇరాన్ – హమాస్ – హిజ్బుల్లా.. ఈ యుద్ధం ముగింపు లేని పోరాటంలా మారుతోంది. అమెరికా వంటి దేశాల యుద్ధ కాంక్ష, పెత్తందారీ వ్యవస్థలు కలిసి శాంతిని సమాధి చేస్తున్నాయి. ఈ యుద్ధం కేవలం క్షిపణులు, డ్రోన్లతోనే ఆగిపోవడం లేదు. ఇది సముద్ర మార్గాలను దిగ్బంధిస్తోంది. ఎర్ర సముద్రం మీదుగా సాగాల్సిన రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఫలితంగా సప్లై చైన్ కు ఆటంకం కలుగుతోంది. 

యుద్ధం రాగానే మొదట పెరిగేది పెట్రోల్, డీజిల్ ధరలు. రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా మన దేశం దిగుమతి చేసుకునే వంట నూనెలపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కోవిడ్ సమయంలో చూసిన ధరల కంటే ఇప్పుడు ధరలు సలసలా కాగుతున్నాయి. మిడిల్ ఈస్ట్  నుండి వచ్చే ముడి సరుకులు ఆగిపోవడంతో తయారీ రంగం కుదేలవుతోంది. పీల్చే గాలి, తాగే నీరు తర్వాత అత్యంత ముఖ్యం ఆహారం. కానీ ఇప్పుడు ఆహార భద్రత ప్రశ్నార్థకంగా మారింది. యుద్ధ ప్రాంతాల్లో పంటలు పండవు, పండిన పంటలు చేతికి రావు. మధ్యప్రాచ్యం మీదుగా సాగే అంతర్జాతీయ వాణిజ్యం నిలిచిపోవడం వల్ల ఆఫ్రికా, ఆసియా దేశాలకు చేరాల్సిన ఆహార ధాన్యాలు మార్గమధ్యలోనే ఆగిపోతున్నాయి.

భారత్ నుండి మిడిల్ ఈస్ట్ కు పెద్ద ఎత్తున బియ్యం, పండ్లు, కూరగాయలు ఎగుమతి అవుతాయి. అలాగే అక్కడ నుండి మనకు డ్రై ఫ్రూట్స్ , కెమికల్స్, ఫెర్టిలైజర్స్ దిగుమతి అవుతాయి. యుద్ధం వల్ల పోర్టులు  మూతపడటం, బీమా ఛార్జీలు పెరగడంతో ఈ వ్యాపారం కుప్పకూలింది. మన రైతులు పండించిన పంటకు సరైన ధర రాక, వినియోగదారులకు తక్కువ ధరకు వస్తువు దొరకక.. రెండు వైపులా నష్టం జరుగుతోంది. కేవలం ఆహారం మాత్రమే కాదు.. మనిషి ప్రాణాలను కాపాడే మందుల తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు మధ్యప్రాచ్య దేశాల ద్వారానే రవాణా కావాలి. యుద్ధం వల్ల సరఫరాలో అంతరాయం ఏర్పడితే, హాస్పిటల్స్ లో  మందుల ధరలు పెరగడమే కాకుండా ప్రాణాపాయం కూడా సంభవిస్తుంది. చర్మ ఉత్పత్తులు, రసాయన పరిశ్రమలు అన్నీ ముడి పదార్థాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. యుద్ధంతో సాధించేది ఏముంది?

ప్రకృతి విపత్తులు చోటు చేసుకున్నప్పుడు అనేక రకాల అనర్ధాలు జరుగుతాయి. అవి మనిషి జీవితం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంటాయి. ఈ ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన అనేక యుద్ధాలు మనిషి జీవితం మీద అత్యంత తీవ్రంగా ప్రభావం చూపించాయి. కొన్ని  దేశాల యుద్ధకాంక్ష వల్ల.. పెత్తందారి వ్యవస్థను కొనసాగించాలనే తీరు వల్ల యుద్ధాలు వస్తున్నాయి.

ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధం సాగుతోంది. ఈ యుద్ధం మొదట్లో కొద్ది రోజుల వరకు సాగుతుందని అందరూ అనుకున్నారు. అయితే పరిస్థితులు ఇప్పటికీ చక్కబడలేదు. ఈ యుద్ధం ఇంకా ఎన్నిరోజులు సాగుతుందో తెలియదు. కాకపోతే ఈ యుద్ధం వల్ల ఎదురవుతున్న ప్రతికూలతలను ప్రపంచం ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఎదుర్కొంటున్నది. ఇప్పటికే చాలా వరకు దేశాలలో పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకున్నాయి. ఈ యుద్ధం కేవలం చమురు, గ్యాస్ వరకే ఆగిపోవడం లేదు. అనేక దేశాల ఆర్థిక పరిస్థితులు తారుమారవుతున్నాయి. 

వంట నూనెలు.. ఆహార గింజలు.. ఎండు ఫలాలు.. ఔషధాలు.. ఖనిజాలు.. ముడి పదార్థాలు.. పండ్లు.. చర్మ ఉత్పత్తులు.. ఇలా ప్రతి విభాగము తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నది. దీని ఆధారంగా సాగే పరిశ్రమలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. సకాలంలో దిగుమతులు, ఎగుమతులు జరగకపోతే ధరల స్థాయి అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పటికే వంట నూనెల ధరలు సలసలా కాగుతున్నాయి. కోవిడ్ నాటికంటే ఎక్కువ ధరలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పప్పు దినుసులు.. తిండి గింజల ధరలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.  అందువల్లే యుద్ధమనేది ఎప్పుడైనా సరే వినాశనాన్ని మాత్రమే కోరుతుంది. దానివల్ల ప్రపంచం మొత్తం తీవ్రంగా ప్రభావితం అవుతుంది.  అందుకే యుద్ధం త్వరగా సమసిపోయి ప్రపంచం శాంతి వైపు పయనించాలని ఆ దిశగా ప్రపంచాధినేతలు కృషి చేయాలని ఆకాంక్షిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *