న్యాయాన్ని పరిరక్షించడంలో న్యాయమూర్తుల పాత్ర కీలకం. ఉత్తరప్రదేశ్ లోని ఒక ఫాస్ట్-ట్రాక్ కోర్టు జడ్జి ఇప్పుడు నేరస్థుల పాలిట సింహస్వప్నంగా మారారు. మాఫియాలు, గ్యాంగ్స్టర్లు అనే తేడా లేకుండా తప్పు చేస్తే ఉరిశిక్ష వేయడానికి ఆయన ఏమాత్రం వెనుకాడటం లేదు. కేవలం నాలుగు నెలల వ్యవధిలో ఏకంగా 23 మందికి ఉరిశిక్షలు విధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు యూపీ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి రవికుమార్ దివాకర్. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు న్యాయవ్యవస్థలో హాట్ టాపిక్ గా మారాయి. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్నగర్ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విధులు నిర్వర్తిస్తున్న జడ్జి రవికుమార్ దివాకర్.. తన సంచలన తీర్పులతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా ఆయన బెంచ్ ముందుకు ఒక దారుణమైన వరకట్న కేసు విచారణకు వచ్చింది. నదీమ్ అనే వ్యక్తి అదనపు కట్నం కోసం తన భార్యను అత్యంత కిరాతకంగా సజీవ దహనం చేశాడు. ఈ కేసును వేగంగా విచారించిన జడ్జి దివాకర్, నేరం రుజువు కావడంతో నిందితుడు నదీమ్ కు ఏమాత్రం కనికరం లేకుండా మరణశిక్ష విధించారు. గడిచిన కేవలం నాలుగు నెలల్లో జడ్జి దివాకర్ విధించిన ఉరిశిక్షల్లో ఇది 23వది కావడం విశేషం.
తీర్పు చదివి వినిపించిన అనంతరం జడ్జి రవికుమార్ దివాకర్ కోర్టు హాలులో చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేశాయి. నేను నా విధులను నిర్వర్తించే క్రమంలో ఏ మాఫియాకు, గ్యాంగ్స్టర్లకు భయపడే ప్రసక్తే లేదు. న్యాయమూర్తి అనే వ్యక్తి నిష్పక్షపాతంగా ఉండాలని, బలవంతులు లేదా నేరస్థులకు భయపడి వ్యవహరించడం వల్ల న్యాయవ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసం దెబ్బతింటుందని ఆయన చెప్పడం ఆయన నిజాయితీకి నిదర్శనంగా నిలిచింది. దేవుడికి తప్ప మరెవరికీ భయపడకూడదని తన తల్లిదండ్రులు తనకు చిన్నప్పుడే నూరిపోశారని దివాకర్ చెప్పారు. తన సిద్ధాంతాలకు కట్టుబడి పని చేయగలిగినంత కాలం ఈ న్యాయ విధులను కొనసాగిస్తానని, ఏ ఒత్తిడికి తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. ఫాస్ట్-ట్రాక్ కోర్టుల ద్వారా నేరాలకు పాల్పడే వారికి కఠినమైన శిక్షలు పడితేనే సమాజంలో మార్పు వస్తుందని సామాన్య ప్రజలు సైతం జడ్జి దివాకర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రవికుమార్ దివాకర్ లాంటి ధైర్యవంతులైన నిజాయితీ కలిగిన న్యాయమూర్తులు ప్రతి జిల్లాలో ఉంటే జరుగుతున్న చాలా అన్యాయాలకు అడ్డుకట్ట పడుతుందని ప్రజలు అంటున్నారు.