కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026–27 తెలంగాణపై కొనసాగుతున్న నిర్లక్ష్యానికి మరో స్పష్టమైన నిదర్శనమని బీ.ఆర్.ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. దేశ ఆర్థిక వృద్ధికి కీలకంగా దోహదపడుతున్న తెలంగాణకు ఈ బడ్జెట్‌లోనూ న్యాయం జరగకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి బీజేపీకి 8 మంది,కాంగ్రెస్ కి 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా రాలేదని ఆక్షేపించారు. పార్లమెంట్‌లో తెలంగాణ గొంతు వినిపించడంలో కాంగ్రెస్, బిజెపి రెండు జాతీయ పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా, బడ్జెట్ లో తెలంగాణకు నిధులు రాబట్టలేక పోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. కేంద్ర క్యాబినెట్‌లో ఉండి కూడా నిధులు తీసుకురాలేకపోవడం వారి అసమర్థతను చూపుతోందని సీఎం రేవంత్ రెడ్డి 60కిపైగా సార్లు ఢిల్లీ వెళ్లినా, వాటి ఫలితం మాత్రం శూన్యమని విమర్శించారు. దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లయిన నిరుద్యోగం, తయారీ రంగం పతనం, రైతుల సంక్షోభం గురించి బడ్జెట్‌లో కనీస ప్రస్తావన లేదు. దేశ భవిష్యత్తుపై ఎటువంటి స్పష్టత లేని బడ్జెట్ ఇదని హరీష్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు.