న్యాయం కోసం, రక్షణ కోసం సామాన్యులు వెళ్లే ఏకైక చోటు న్యాయస్థానం. అయితే అలాంటి కోర్టు ఆవరణలోనే ఒక మహిళకు భద్రత లేకుండా పోయింది. చట్టం అంటే భయం లేకుండా, పోలీసులు, లాయర్లు చూస్తుండగానే ఒక మహిళపై దారుణమైన దాడి జరిగడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని మహారాజాగంజ్ ఫ్యామిలీ కోర్టులో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఒక వివాహితపై ఆమె భర్త, అత్తింటి వారు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని పురంధర్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఓ మహిళకు, ఆమె భర్తకు మధ్య గత కొంతకాలంగా వివాహ బంధంలో విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆమె తన భర్త, అత్తింటి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తన జీవనాధారం కోసం భరణం ఇప్పించాలంటూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఈ భరణం కేసు విచారణలో భాగంగానే బాధితురాలు తన తండ్రి, సోదరితో కలిసి మహారాజాగంజ్ ఫ్యామిలీ కోర్టుకు వచ్చింది. సరిగ్గా ఆ సమయంలోనే ఆమె భర్త ఉన్మాదిలా రెచ్చిపోయి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.
ఏకంగా కోర్టు ప్రాంగణంలో, అది కూడా చట్టాన్ని కాపాడే పోలీసులు, న్యాయవాదులు చూస్తుండగానే జరిగింది. కోర్టు కేసును ఇలాగే కొనసాగిస్తే ప్రాణాలతో వదిలిపెట్టం అని, చంపేస్తామని నిందితులు ఆమెను తీవ్రంగా బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కోర్టు ఆవరణలో పెద్ద ఎత్తున ఘర్షణ జరగడాన్ని గమనించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని జోక్యం చేసుకున్నారు. మహిళను రక్షించి, దాడికి పాల్పడిన ఆమె భర్తను, ఇతరులను అక్కడి నుంచి పంపించి వేశారు. ప్రాణభయంతో వణికిపోయిన ఆ బాధితురాలు.. జరిగిన ఘోరంపై స్థానిక పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. అంతేకాదు, దాడికి సంబందించిన వీడియో క్లిప్‌ను కూడా సాక్ష్యంగా పోలీసులకు సమర్పించింది. ఈ ఘటనకు సంబందించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యూపీ పోలీసుల తీరుపై కూడా విమర్శలు వస్తుండడంతో వెంటనే అప్రమత్తమైన మహారాజాగంజ్ పోలీసులు ట్విట్టర్ వేదికగా ఒక అధికారిక ప్రకటన చేశారు. బాధితురాలి ఫిర్యాదు, వీడియో ఆధారాల మేరకు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చట్ట ప్రకారం వారిపై కఠినమైన తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కోర్టుల వద్ద మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.