అవతార్ రేంజ్ విజువల్స్‌తో రాకా సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తుందా?

Spread the love

‘పుష్ప’1 మరియు 2 సినిమాల తరువాత అల్లు అర్జున్ చేస్తున్న ‘రాకా’ సినిమాపై దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ప్రతి న్యూస్ ప్రేక్షకులలో ఆసక్తిని మరింత పెంచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ పుష్ప సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ చేస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి తాజాగా తమిళ దర్శకుడు శిబి చక్రవర్తి చేసిన కామెంట్స్ తో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రపంచ సినిమా చరిత్రలో విజువల్స్ లో ఒక స్టాండర్డ్ సెట్ చేసిన జేమ్స్ కామెరూన్ చిత్ర రాజం ‘అవతార్’ ను మించే విధంగా ‘రాకా’ లో విజువల్స్ ఉంటాయని ఆయన చేసిన వ్యాఖ్యలు సినిమా ఎంత భారీ స్థాయిలో తెరకెక్కనుందో తెలుపుతున్నాయి. భారతీయ సినిమా రంగానికి గర్వకారణంగా నిలిచేలా ఈ సినిమాను అట్లీ తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. ఆయన నాకు విజువల్స్ చూపించారు. అవతార్ లో కూడా నేను అటువంటి విజువల్స్ చూడలేదని తెలిపారు.

ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా అధికారిక టైటిల్ రాకాను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఆయన గుండుతో, దట్టమైన గడ్డంతో, పదునైన గోళ్లతో విడుదల చేసిన లుక్ ఆకట్టుకుంది. ఈ లుక్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా తారాస్థాయికి చేర్చింది. ఇక  ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ వెనుక దర్శకుడు అట్లీ ఆలోచనలు మరియు ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ను ఆకట్టుకునే వ్యూహం ఉంది. కేవలం భారతీయ మార్కెట్ మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటే విధంగా  ఈ కథను రూపొందించినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా సుమారు రూ.800 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనితో సాంకేతికంగా రాకా ఒక భారీ సినిమాగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా శిబి చక్రవర్తి చేసిన కామెంట్స్ తో మరోసారి సినీ ప్రియుల దృష్టి ఈ సినిమాపై పడింది. 

దీపికా పదుకొనేతో పాటు ఈ చిత్రంలో రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి ప్రముఖ నటీమణులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ సినిమా  భారతీయ సినిమా చరిత్రలో కొత్త మైలురాళ్లను అధిగమించే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా నుండి కీలక అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *