ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED), హైదరాబాద్ జోనల్ కార్యాలయం, తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) నెయ్యి కల్తీ కేసుకు సంబంధించి, కైలాష్ చంద్ మంగ్లాను ఈ ఎంల 17న ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, 2002లోని సెక్షన్ 19 కింద అరెస్టు చేసింది. అనంతరం ఆయనను ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ప్రత్యేక PMLA కోర్టు ముందు హాజరుపరచగా, కోర్టు ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఈ మేరకు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఒక ఎఫ్.ఐ.ఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. టీటీడీకి కల్తీ నెయ్యిని అక్రమంగా సరఫరా చేసిన వ్యవహారంలో క్రిమినల్ కుట్ర, మోసం, నకిలీ పత్రాల తయారీ మరియు అవినీతి వంటి ఆరోపణలు ఎఫ్.ఐ.ఆర్ లో ఉన్నాయి.ఈడీ దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, రిఫైన్డ్ పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామోలిన్ తదితర పదార్థాలతో పాటు ఎం.జీ -90, మోనోగ్లిజరైడ్స్, Myvacet Soft 400, Acetic Acid Ester వంటి రసాయనాలను ఉపయోగించి కల్తీ నెయ్యిని తయారు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఈ కల్తీ నెయ్యిని అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి పేరుతో టీటీడీకి సరఫరా చేసినట్లు పేర్కొంది.2019–2024 మధ్యకాలంలో టీటీడీకి జరిగినట్లు ఆరోపించబడుతున్న కల్తీ నెయ్యి సరఫరాల విలువ సుమారు రూ.230 కోట్లు కాగా, అందులో సుమారు రూ.96 కోట్ల విలువైన కల్తీ నెయ్యిని కైలాష్ చంద్ మంగ్లా తయారు చేసినట్లు ఈడీ తెలిపింది.M/s Sukriti Foods Pvt. Ltd. సంస్థ ప్రమోటర్ అయిన కైలాష్ చంద్ మంగ్లా ఈ కేసులో సహ-కుట్రదారుల్లో ఒకరిగా ఉన్నారని ఈడీ పేర్కొంది. కల్తీ పదార్థాల సేకరణకు ఆయన సహకరించడంతో పాటు, తన ఫ్యాక్టరీ ప్రాంగణంలో కల్తీ నెయ్యిని తయారు చేసినట్లు ఆరోపించింది.అలాగే, M/s Sri Vyshnavi Dairy Specialities Pvt. Ltd., M/s Malganga Milk & Agro Products Pvt. Ltd. మరియు M/s A.R. Dairy Foods Pvt. Ltd. వంటి వివిధ ముందస్తు/మధ్యవర్తి సంస్థల ద్వారా కల్తీ నెయ్యి సరఫరాను ఆయన సమన్వయం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని ఈడీ తెలిపింది.దర్యాప్తులో మరింతగా, నెయ్యి మరియు రిఫైన్డ్ పామ్ ఆయిల్ కొనుగోలు, విక్రయాలకు సంబంధించి తప్పుడు రికార్డులను కైలాష్ చంద్ మంగ్లా సృష్టించి నిర్వహించినట్లు ED పేర్కొంది. కల్తీ పదార్థాలను వాస్తవంగా ఉపయోగించిన విషయాన్ని దాచిపెట్టి, నిజమైన ఆవు నెయ్యిని తయారు చేసి సరఫరా చేసినట్లుగా చూపించడమే దీని ఉద్దేశమని దర్యాప్తు సంస్థ తెలిపింది.ఇంతకుముందు, M/s Bhole Baba Organic Dairy Milk Pvt. Ltd. ప్రమోటర్ మరియు డైరెక్టర్ అయిన విపిన్ జైన్‌ను కూడా ఈడీ అరెస్టు చేసింది. టీటీడీకి కల్తీ నెయ్యి తయారీ మరియు మోసపూరిత సరఫరాను నిర్వహించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగానే ఆయనను అరెస్టు చేసినట్లు ఈడీ తెలిపింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేసింది.