భారతదేశం, పాకిస్థాన్.. ఈ రెండు దేశాలు పేరుకు దాయాదులైన సరిహద్దుల్లో ఎప్పుడూ తుపాకుల మోత, రాజకీయంగా ఎప్పుడూ ఉద్రిక్తతలే. అయితే ఈ రెండు దేశాల ప్రజల హృదయాలను ఏకం చేసే ఒకే ఒక్క పేరు.. ఒకే ఒక్క వీరుడు ఎవరైనా ఉన్నారంటే.. అది ముమ్మాటికీ భగత్ సింగ్ మాత్రమే అనేది మరొక ఉదాహరణతో చెప్పుకోవచ్చు. అదే తాజాగా పాక్ లో జరిగిన భగత్ సింగ్ జయంతి వేడుకల ఉదంతం. దేశం కోసం నవ్వుతూ ఉరికొయ్యను ముద్దాడిన అమరవీరుడు భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలు భారతదేశంలో ఎంత ఘనంగా జరిగాయో.. దాయాది దేశం పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో కూడా అంతే ఘనంగా జరిగాయి. లాహోర్ హైకోర్టు వేదికగా భగత్ సింగ్ జయంతి వేడుకలు నిర్వహించిన పాక్ పౌరులు.. ఏకంగా ఆయనకు పాకిస్థాన్ అత్యున్నత పురస్కారం ఇవ్వాలంటూ ఒక సంచలన తీర్మానాన్ని ఆమోదించడం భగత్ సింగ్ అభిమానులు గర్వపడాల్సిన అంశం.
భగత్ సింగ్ పోరాటం కేవలం భారతదేశానికే పరిమితం కాదు, అది అఖండ భారత ఉపఖండానికి స్ఫూర్తిదాయకం అని పాకిస్థానీయులు అంగీకరిస్తారు. అందుకే ప్రతి ఏడాదీ ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఎంతో ఘనంగా జరుగుతుంటాయి. భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా లాహోర్ హైకోర్టు బార్ అసోసియేషన్‌కు చెందిన డెమోక్రటిక్ లాన్లో భగత్‌సింగ్ స్మారక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక భారీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఛైర్మన్, పాకిస్థాన్ లోని ప్రముఖ న్యాయవాది ఇంతియాజ్ రషీద్ ఖురేషీ మాట్లాడుతూ భగత్ సింగ్ త్యాగాన్ని స్మరించుకున్నారు. భారత ఉపఖండ స్వాతంత్రోద్యమ చరిత్రలో భగత్‌సింగ్ చేసిన పోరాటం ఒక మరుపురాని ముఖ్య ఘట్టమని ఆయన తెలిపారు. బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన భగత్‌సింగ్ ధైర్యం, ఆయన రాజకీయ అవగాహన, చిన్న వయసులోనే ఆయన చేసిన ప్రాణ త్యాగం.. నేటి పాకిస్థాన్ యువతరాలకు ఇప్పటికీ స్ఫూర్తినందిస్తున్నాయని ఆయన గర్వంగా తెలియజేశారు. భగత్ సింగ్ స్మారక ఫౌండేషన్ సభ్యులు, స్థానిక మేధావులు, లాయర్లు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని భగత్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ జయంతి వేడుకల సందర్భంగా లాహోర్ బార్ అసోసియేషన్ ఒక చారిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించింది. చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని పోరాటానికి, త్యాగానికి ప్రతీకగా నిలిచిన భగత్‌సింగ్‌కు.. పాకిస్థాన్ అత్యున్నత పౌర పురస్కారమైన నిషాన్-ఇ-పాకిస్థాన్ అవార్డును అందించాలని ఆ తీర్మానంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వాతంత్య్రానికి ముందు ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ అంతా కలిపి ఒకే అఖండ భారతం. ఆ సమయంలో భగత్‌సింగ్ అవిభక్త పంజాబ్‌లోని లయల్పుర్ జిల్లా బంగా గ్రామంలో 1907 లో జన్మించారు. దేశ విభజన తర్వాత ఆ లయల్పుర్ జిల్లా పాకిస్థాన్‌లో కలిసిపోయింది. ప్రస్తుతం ఆ నగరాన్ని ఫైసలాబాద్ అని పిలుస్తున్నారు. అంటే భగత్ సింగ్ పుట్టిన ప్రాంతం ప్రస్తుతం పాకిస్థాన్ లోనే ఉంది. ఆయన తన విద్యాభ్యాసం మొత్తం లాహోర్ లోనే పూర్తి చేశాడు. అంతేకాదు, బ్రిటీష్ అధికారి సాండర్స్ హత్య కేసులో యూనివర్సిటీ క్యాంపస్ లో భగత్ సింగ్ పై విచారణ జరిగింది కూడా లాహోర్ లోనే. 1931 మార్చి 23న భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ లను ఉరితీసింది లాహోర్ సెంట్రల్ జైలులోనే. ప్రస్తుతం ఆ జైలు ఉన్న స్థలాన్ని లాహోర్ లో షాద్మాన్ చౌక్ అని పిలుస్తున్నారు. భగత్ సింగ్ పుట్టిన నేల, ఆయన చిందించిన రక్తం పాకిస్థాన్ మట్టిలోనే ఉండటంతో.. అక్కడి పంజాబీలు ఆయనను భారతీయుడిగా కాకుండా, తమ పంజాబ్ ముద్దుబిడ్డగా, తమ మట్టి హీరోగా ఓన్ చేసుకున్నారు. భగత్ సింగ్ ను ఉరితీసిన ఆ షాద్మాన్ చౌక్ కు భగత్ సింగ్ చౌక్ అని పేరు పెట్టాలని ఈ భగత్ సింగ్ స్మారక ఫౌండేషన్ గత కొన్నేళ్లుగా పాక్ ప్రభుత్వంతో న్యాయపోరాటం చేస్తూనే ఉంది.
ఇక కేవలం జయంతి వేడుకలు చేయడమే కాకుండా, లాహోర్ హైకోర్టులో భగత్ సింగ్ కోసం మరో అద్భుతమైన పోరాటం జరుగుతోంది. భగత్ సింగ్ పై బ్రిటీష్ ప్రభుత్వం మోపిన సాండర్స్ హత్య కేసు FIR లో అసలు భగత్ సింగ్ పేరే లేదని, ఆయనను అక్రమంగా బ్రిటీష్ వారు ఉరితీశారని నిరూపించడానికి ఇంతియాజ్ రషీద్ ఖురేషీ లాహోర్ కోర్టులో పిటిషన్ వేశారు. మరణించిన దాదాపు 95 ఏళ్ల తర్వాత కూడా, భగత్ సింగ్ నిర్దోషి అని పాకిస్థాన్ కోర్టులో న్యాయపోరాటం జరుగుతోందంటే ఆయన మీద వారికి ఉన్న అభిమానానికి ఇది నిదర్శనం. పాకిస్థాన్ ప్రజలు కూడా మన స్వాతంత్య్ర సమరయోధుడిని ఇంతలా గౌరవించడం ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన విషయం.