మరోసారి యోగీ ప్రభంజనంమేనా..? తాజా సర్వేలో బీజేపీ వైపే జనం 

Spread the love

దేశ రాజకీయాలలో ఉత్తరప్రదేశ్ రాజకీయాలది ఒక ప్రత్యేక శైలి. దేశం మొత్తాన్ని  సమూలంగా శాసించే సత్తా ఉన్న ఏకైక రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా ఉత్తరప్రదేశ్ మాత్రమే. 80 లోక్ సభ స్థానాలు, 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న యూపీలో ఎవరు గెలిస్తే, కేంద్రంలో వారి హవానే నడుస్తుంది.  2027 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి నుంచే ఎన్నికల పొలిటికల్ చర్చలు నడుస్తున్నాయి.  అధికార బీజేపీ,  ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీలు తమ గ్రౌండ్ వర్క్ ను, ప్రచార వ్యూహాలను అప్పుడే ముమ్మరం చేసేశాయి. గత లోక్ సభ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి బీజేపీకి ఊహించని షాక్ ఇవ్వడంతో 2027 అసెంబ్లీ ఎన్నికల్లో యోగీ ఆదిత్యనాథ్ కు గట్టి పోటీ ఎదురుకాబోతోందని అంతా భావించారు. కానీ తాజాగా వచ్చిన ఒక మెగా సర్వే ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి.  న్యూస్ లీడర్ లైవ్- మాట్రిజ్ న్యూస్ కమ్యూనికేషన్ సంస్థ నిర్వహించిన తాజా ఒపీనియన్ పోల్ లో.. యూపీలో మళ్లీ అధికారం చేపట్టేది బీజేపీనే  అని స్పష్టంగా తేలింది. యూపీ రాజకీయాలంటే కుల సమీకరణాలు, మత ప్రాతిపదికలు, అభివృద్ధి ప్రాతిపదిక అనేదానిపై ఆధారపడి నడుస్తాయని అంటుంటారు. గత సార్వత్రిక ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ, కాంగ్రెస్ కూటమి సాధించిన ఫలితాలు చూసి.. యోగీ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది అని విశ్లేషకులు భావించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రజల ఆలోచనా విధానం పూర్తిగా మారిపోతుందని  న్యూస్ లీడర్ లైవ్- మాట్రిజ్ న్యూస్ కమ్యూనికేషన్ నిర్వహించిన సర్వే తేల్చి చెప్పింది.

ఈ సర్వే ప్రకారం.. మొత్తం 403 శాసనసభ స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీయే  ఏకంగా 267 స్థానాల్లో విజయం సాధించి పూర్తి స్థాయి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 202 మ్యాజిక్ ఫిగర్ కంటే చాలా ఎక్కువగా సీట్లు సాధించి తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించబోతోందని తెలుస్తోంది. ఇక ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమి తీవ్రంగా శ్రమించినప్పటికీ.. కేవలం 132 స్థానాల వద్దే ఆగిపోతుందని ఈ సర్వే అంచనా వేసింది. అసలు బీజేపీకి యూపీలో ఇంతటి తిరుగులేని ఆధిక్యం రావడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అమలు చేస్తున్న  లా అండ్ ఆర్డర్  పాలసీయే కారణమని తెలుస్తోంది. ఒకప్పుడు మాఫియా డాన్లు, గ్యాంగ్‌స్టర్ల ఆగడాలకు నిలయంగా ఉన్న ఉత్తరప్రదేశ్ లో.. యోగీ సర్కార్ వచ్చిన తర్వాత గూండారాజ్ ని పూర్తిగా అరికట్టారు. మాఫియా ఆస్తులపై బుల్డోజర్లు నడిపించడం, మహిళల రక్షణ కోసం యాంటీ రోమియో స్క్వాడ్స్ ఏర్పాటు చేయడం సాధారణ ప్రజల్లో, ముఖ్యంగా మహిళా ఓటర్లలో ఒక బలమైన భద్రతా భావాన్ని కల్పించింది.  దానికి తోడు రోడ్లు, ఎక్స్‌ప్రెస్‌వేలు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, భారీ పెట్టుబడుల రాకతో యూపీ అభివృద్ధి పరుగులు పెడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పేదలకు ఉచిత రేషన్, పక్కా ఇళ్ల నిర్మాణం వంటివి క్షేత్రస్థాయిలో ఓటర్లను బీజేపీ వైపే ఉండేలా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *