అక్కినేని కోడలు, నాగచైతన్య సతీమణి అయిన శోభితా ధూళిపాళ తనకంటూ ఒక సపరేట్ రూట్ క్రియేట్ చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా నటనను అద్భుతంగా కొనసాగిస్తున్నారు. కేవలం గ్లామర్ పాత్రలకు పరిమితం కాకుండా, తన ఇమేజ్ హోదాను బట్టి కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్టివ్‌గా ఎంచుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.దీనిలో భాగంగానే ఆమె తాజాగా నటిస్తోన్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ ‘వేట్టువం’. మద్రాస్, కబాలి, కాలా, సార్పట్ట పరంపర, రీసెంట్ గా వచ్చిన తంగలాన్ వంటి విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ఒక గొప్ప గుర్తింపు తెచ్చుకున్న తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ పా రంజిత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ను వరల్డ్ ఆఫ్ వేట్టువం పేరుతో మేకర్స్ అఫీషియల్ గా విడుదల చేశారు. ఈ గ్లింప్స్ లో శోభితా ధూళిపాళ యాక్షన్ తో అదరగొట్టారు.
తాజాగా రిలీజ్ అయిన వరల్డ్ ఆఫ్ వేట్టువం గ్లింప్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. లెర్న్ అండ్ టీచ్ ప్రొడక్షన్స్, నీలం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్ సాయి దేవానంద్, ఎస్ సాయి వెంకటేశ్వరన్, పా రంజిత్‌లు సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు. విజువల్స్ చూస్తుంటే ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద పెద్ద సంచలనమే సృష్టించేలా ఉంది.ఈ సినిమాలో పా రంజిత్ మరొక అద్భుతమైన ప్రయోగం చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన అతి పురాతనమైన, అత్యంత ప్రమాదకరమైన ఆదిమురై అనే యుద్ధ కళతో పాటు పలు మార్షల్ ఆర్ట్స్ ను ఈ గ్లింప్స్‌లో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇక ఈ సినిమాలోని స్టార్ కాస్ట్ విషయానికి వస్తే.. ఇదొక మల్టీ స్టారర్ లాగా అనిపిస్తోంది. ఈ గ్లింప్స్ లో పరిచయం చేసిన క్యారెక్టర్స్ పేర్లు కూడా చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి. ధర్మరాజన్ అనే అత్యంత కీలకమైన పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య నటిస్తున్నారు. సార్పట్ట పరంపర తర్వాత ఆర్య, పా రంజిత్ కాంబో రిపీట్ అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అలాగే సెంబియన్‌గా డైనమిక్ యాక్టర్ షబీర్ కల్లరక్కల్ , వీరవర్మన్‌గా పా రంజిత్ ఆస్థాన నటుడు కలైయరసన్, రాది అనే పవర్ ఫుల్ లేడీ రోల్ లో శోభితా ధూళిపాళ కనిపించనున్నారు. వీళ్లతో పాటు వి.ఆర్. దినేష్, మిమ్ గోపీ, గురు సోమసుందరం, జాన్ విజయ్, సాయి ధీన, హరీష్ ఉత్తమన్ లాంటి హేమాహేమీలు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం ఈ సినిమా యాక్షన్ సీన్స్ కు ప్రాణం పోస్తోంది. రూపేష్ షాజీ సినిమాటోగ్రఫీ, సెల్వ ఆర్కే ఎడిటింగ్ వర్క్ అద్భుతంగా ఉన్నాయి.
అయితే ఈ గ్లింప్స్ రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు శోభితా ధూళిపాళ. ఈ సినిమాలో ఆమెది కేవలం ఒక గ్లామర్ డాల్ రోల్ కాదు, కత్తి పట్టి శత్రువులను చీల్చి చెండాడే ఒక వారియర్ క్యారెక్టర్. ఈ సందర్భంగా నటి శోభితా ధూళిపాళపై దర్శకుడు పా రంజిత్ ప్రశంసల వర్షం కురిపించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శోభిత ఒక అద్భుతమైన నటి. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను ఆమె డూప్ లేదా స్టంట్ డబుల్ లేకుండా స్వయంగా చేశారు. సెట్స్ లో యాక్షన్ సీన్స్ తీసేటప్పుడు కేవలం కెమెరా రిహార్సల్స్ కోసం, లైటింగ్ చెక్ చేసుకోవడానికి మాత్రమే మేము డూప్ లేదా స్టంట్ డబుల్స్ ను వాడేవాళ్ళం. కానీ ఫైనల్ టేక్, ఆయా ప్రమాదకరమైన సీన్స్ అన్నీ శోభిత స్వయంగా చేశారు అని ఆయన వివరించారు. వేట్టువం షూటింగ్ లో శోభితకు శారీరకంగా ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని, కానీ ఒక పాత్ర కోసం సహజంగా చేసే సన్నద్ధతను మించిపోయి ఆమె కష్టపడ్డారని పా రంజిత్ ఎంతో గొప్పగా ప్రశంసించారు. డైరెక్టర్ మాత్రమే కాదు, ఈ సినిమాలో తన పాత్ర కోసం, ఆ యాక్షన్ సన్నివేశాల గురించి స్వయంగా శోభితా ధూళిపాళ కూడా స్పందించారు. ఆ ప్రాచీన యుద్ధ విద్యల కొరియోగ్రఫీ నేర్చుకోవడం ఎంత కష్టమో ఆమె వివరించారు. పా రంజిత్‌తో కలిసి పనిచేయడంపై శోభిత తన ఆనందం వ్యక్తం చేశారు. షూటింగ్‌లో శోభిత నిబద్ధత చేసిన శ్రమ చూస్తుంటే.. పా రంజిత్ సృష్టించిన భవిష్యత్తు ప్రపంచాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడంలో ఆమె వంద శాతం సక్సెస్ అయ్యారని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.