మిడిల్ ఈస్ట్ మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు హర్ముజ్ జలసంధిని మూసివేస్తూ ఇరాన్ తీసుకున్న నిర్ణయంతో రెండు వైపులా సెగ రాజేస్తుంటే వివాదం మరింత ముదిరే విధంగా మరొక ఘటన చోటుచేసుకుంది. అంతర్జాతీయంగా సైనికంగా తిరుగులేని శక్తిగా చెప్పుకునే అమెరికాకు చెందిన అత్యంత ఆధునికమైన సబ్‌మెరైన్ ను ఇరాన్ బలగాలు ఏకంగా తమ సొంతం చేసుకున్నాయి. ఇరాన్‌కు చెందిన అత్యంత శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఒక సంచలన ప్రకటన చేసింది. హర్ముజ్ జలసంధిలోకి ప్రవేశిస్తున్న ఒక అమెరికన్ అన్ మ్యాన్డ్ సబ్‌మెరైన్ ను తమ నావికా దళాలు విజయవంతంగా అడ్డుకుని, హైజాక్ చేశాయని ప్రకటించింది. దీనికి సంబంధించిన దృశ్యాలను ఇరాన్ అధికారిక మీడియా విడుదల చేసింది. ఆ వీడియోలో.. సముద్ర ఉపరితలంపై తేలుతున్న ఒక భారీ అండర్ వాటర్ డ్రోన్‌ను ఇరాన్ దళాలు స్వాధీనం చేసుకుని తమ కంట్రోల్లోకి తీసుకువెళ్లడం స్పష్టంగా రికార్డ్ అయ్యింది. మా ఇంటెలిజెన్స్ అధికారుల పక్కా సమాచారంతో తెల్లవారుజామున ఒక టఫ్ ఆపరేషన్ తో అత్యంత ఆధునికమైన, స్మార్ట్ సబ్‌మెరైన్‌ను మేం పట్టుకున్నాం అంటూ ఐఆర్జీసీ ప్రకటించుకుంది. దీన్ని తమకు దొరికిన ఒక వార్ ట్రోఫీగా ఇరాన్ అభివర్ణించింది.
అయితే ఇరాన్ పట్టుకుంది మనుషులు లేని అన్ మ్యాన్డ్ అండర్ వాటర్ వెహికల్ . ఈ మోడల్ పేరు డైవ్-ఎల్డీ . కాలిఫోర్నియాకు చెందిన ప్రఖ్యాత డిఫెన్స్ టెక్నాలజీ కంపెనీ అండూరిల్ ఇండస్ట్రీస్ ఈ అత్యాధునిక అటానమస్ సబ్‌మెరైన్‌ను తయారు చేసింది. ఇందులో అడ్వాన్స్డ్ రాడార్లు, సోనార్ సిస్టమ్స్ ఉంటాయి. సముద్ర గర్భంలో శత్రు దేశాల మందుపాతరలు ఉన్నాయా? ఆయిల్ పైప్లైన్ల పరిస్థితి ఏంటి? శత్రువుల కదలికలు ఎలా ఉన్నాయి? అనే ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించడానికి అమెరికా నేవీ వీటిని ఉపయోగిస్తుంది. ఇంతటి టెక్నాలజీ ఉన్న డ్రోన్ ఇరాన్ చేతికి చిక్కడం అంటే మామూలు విషయం కాదు. తమ సబ్‌మెరైన్ డ్రోన్‌ను ఇరాన్ పట్టుకుందని, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అమెరికా పరువు అంతర్జాతీయంగా తీసినట్లయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి అమెరికా సెంట్రల్ కమాండ్ రంగంలోకి దిగింది. అమెరికా వాదన ప్రకారం.. ఇరాన్ చెబుతున్నదంతా అబద్ధం. అక్కడ ఎలాంటి సైనిక ఆపరేషన్ జరగలేదు. మాకు చెందిన ఒక అండర్ వాటర్ డ్రోన్ సాంకేతిక లోపంతో సముద్రంలో ఆగిపోయింది. పాడైపోయి తేలుతున్న ఆ డ్రోన్‌ను పట్టుకుని ఇరాన్ గొప్పలు పోతోంది అని అమెరికా ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ చెప్పారు. అంతేకాకుండా, ఇరాన్ చేతికి చిక్కిన ఆ డ్రోన్ చాలా పాత మోడల్ అని, అందులో ఎలాంటి సీక్రెట్ డేటా గానీ, క్లాసిఫైడ్ రాడార్ ఎక్విప్మెంట్ గానీ లేవని అమెరికా కవర్ చేసే ప్రయత్నం చేసింది. అయితే రక్షణ రంగ నిపుణులు మాత్రం అమెరికా వాదనను కొట్టిపారేస్తున్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అమెరికా డ్రోన్‌ను, అది కూడా అత్యంత సెన్సిటివ్ జోన్ అయిన హర్ముజ్ జలసంధిలో వదిలేసి రావడం అమెరికా ఇంటెలిజెన్స్ వైఫల్యమేనని విమర్శిస్తున్నారు. ఒకవేళ అది పాడైపోయినా సరే దాన్ని శత్రువుల చేతికి చిక్కకుండా నాశనం చేసి ఉండాల్సిందని అంటున్నారు.
ఇక కేవలం కొన్ని రోజుల క్రితమే ఇరాన్‌కు చెందిన మూడు ఆయిల్ ట్యాంకర్లను అమెరికా సెంటామ్ దళాలు పేల్చివేశాయి. దానికి కౌంటర్‌గా హర్ముజ్ జలసంధిలో నో-ఎంట్రీ బోర్డు పెట్టిన ఇరాన్, ఇప్పుడు ఏకంగా అమెరికా సబ్‌మెరైన్‌ను హైజాక్ చేసి అమెరికాను మరింత కవ్వింపు చేసింది. ఈ ఘటన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు వాషింగ్టన్ వర్గాల సమాచారం.గతంలో కూడా అమెరికా డ్రోన్లను కూల్చేసినప్పుడు, ట్రంప్ ఇరాన్ కమాండర్ ఖాసిం సులేమానీని మట్టుబెట్టిన చరిత్ర మనకు తెలుసు. ఇప్పుడు అమెరికాకు చెందిన అత్యంత ఆధునిక ఆయుధాన్ని ఇరాన్ ఎత్తుకెళ్లడాన్ని పెంటగాన్ ఏమాత్రం సహించదని రాబోయే రోజుల్లో ఇరాన్ మిలటరీ బేస్‌లపై అమెరికా డైరెక్ట్ గా భారీ ఎయిర్ స్ట్రైక్స్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది.