ఓటమిని ఒప్పుకోని ఆశ్నా చౌదరి గ్రేట్ స్టోరీ

నిన్న అందాల రాశి..
నేడు ఐపీఎస్ అయింది సివిల్స్ రాసి..

హీరోయిన్లకో, సెలబ్రిటీలకో ఫ్యాన్స్ సహజం కానీ అధికారులకు ఉండటం అరుదు. ఇలాంటి కోవలోకే వస్తుంది అష్రా చౌధురి. యూపీకి చెందిన అష్నా రెండేళ్ల క్రితం ఐపీఎస్ కు ఎంపికైంది. అయితే ఆమె ఐపీఎస్ కాకముందు నుంచే అభిమానులు వచ్చిపడ్డారు. ఐపీఎస్ అయ్యాక ఆ సంఖ్య మరింత పెరిగింది. దీనికి ఓ ప్రత్యేక కారణం ఉంది. అదే ఇప్పుడు ఆమెకు లక్షల మంది అభిమానుల్ని సంపాదించిపెడుతోంది.

ఉత్తర్ ప్రదేశ్ లోని పిల్కువాకు చెందిన అష్నా చౌధురిది విద్యావంతుల కుటుంబం. తండ్రి డాక్టర్ అజిత్ చౌధురి ప్రొఫెసర్. తల్లి ఇందూ సింగ్. దీంతో ఆమె కూడా బాగా చదువుకుని ఏ ప్రొఫెసరో అవుతుందని అంతా అనుకున్నారు. కానీ చిన్నప్పటి నుంచి అష్నాకు సేవాగుణం ఎక్కువ కావడంతో ఆమె ఢిల్లీలో ఇంగ్లీష్ లిటరేచర్ చేసి పేద పిల్లలకు సేవ చేసే ఓ స్వచ్చంద సంస్ధలో చేరింది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండటంతో అభిమానులూ రావడం మొదలుపెట్టారు. దీంతో మోడలింగ్ అవకాశాలు కూడా వచ్చాయి.

ఆ తర్వాత సివిల్స్ రాయాలని నిర్ణయించుకున్న అష్నా మోడలింగ్ కు దూరమయ్యారు. 2019లో సివిల్స్ రాసినా ప్రిలిమ్స్ లోనే నిరాశ ఎదురైంది. అయినా వెనక్కి తగ్గలేదు. 2022లో తిరిగి కోచింగ్ లేకుండానే రాసి ఏకంగా 116వ ర్యాంక్ కొట్టింది. దీంతో ఐపీఎస్ కు ఎంపికైంది. అదే ఆమెకు ఎన్నో పాఠాలు నేర్పింది. అవే పాఠాలు తిరిగి ఈ జనరేషన్ లో యువతకు నేర్పాలని అష్నా భావించింది. అంతే తనకు ఎంతో ఇష్టమైన సోషల్ మీడియాలోకి వెళ్లి తన జీవిత అనుభవాలను యువతకు వివరించడం మొదలుపెట్టింది.

తన సివిల్స్ ప్రయాణం, అది నేర్పిన పాఠాలు, గెలుపు సూత్రాలు.. ఇలా ప్రతీదీ ఇన్ స్టాతో పాటు యూట్యూబ్ లోననూ పంచుకోవడమే మొదలుపెట్టిన అష్నాకు ఫాలోవర్స్ అమాంతం పెరిగిపోయారు. ఓవైపు ఐపీఎస్ గా బిజీగా ఉంటూనే ఇలా సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వారికి మెళకువలు నేర్పిస్తూ అష్నా ప్రయాణం సాగిస్తోంది. దీంతో తాజాగా ఇన్ స్టాలో ఆమె ఫాలోవర్ల సంఖ్య 2.7 లక్షలు దాటింది. యూట్యూబ్ లోనూ ఆమె వీడియోలన్నీ వైరల్ అవుతూనే ఉన్నాయి. అలా యూపీలోని ఓ కుగ్రామం నుంచి వచ్చిన యువతి… మోడల్ అయి ఆ తర్వాత ఐపీఎస్ గా మారి సాధించిన విజయం ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది.