బెజవాడ వరద బాధితుల్లో భరోసా నింపిన మంత్రి నారాయణ.

విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరద నగర వాసులపై తీవ్ర ప్రభావం చూపింది. గంటల వ్యవధిలో బుడమేరు పరిసర ప్రాంతాల్ని ముంచేసిన వరద ఎక్కడి జనాన్ని అక్కడే దిగ్బంధించింది. దీంతో వరద మొదలైన తొలిరోజు బాధితులు ఆహారం, తాగునీరు, మందులు అందక అల్లాడిపోయారు. ఇలాంటి పరిస్ధితుల్లో సీఎం చంద్రబాబుతో పోటీపడుతూ వరద ప్రాంతాల్లో పర్యటించి స్వయంగా బాధితుల కష్టాలు తెలుసుకున్న మున్సిపల్ మంత్రి నారాయణ వారికి భారీ ఎత్తున సాయం అందించేందుకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ముందుగా వారి ఆకలి తీరింది. ఆ తర్వాత పరిస్ధితి పూర్తిగా మారిపోయింది.

చూసేందుకు చాలా సామ్యంగా కనిపించే ఏపీ మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణకు పని రాక్షసుడిగా పేరుంది. గతంలో తన నారాయణ విద్యాసంస్థల్లోనో లేక అమరావతి రాజధాని పనుల్లోనో నారాయణను దగ్గరి నుంచి చూసిన వారికి తప్ప ఈ విషయం చాలా మందికి తెలియదు. ఓ పని మొదలుపెడితే దాని అంతు చూసే వరకూ వదలని పట్టుదల నారాయణది. అందుకే అమరావతి రాజధాని వంటి కీలకమైన వ్యవహారాన్ని నడిపించే మున్సిపల్ మంత్రిగా రెండోసారి చంద్రబాబు ఆయన్ను ఎంచుకున్నారు. రాజధాని తర్వాత చంద్రబాబు మరోసారి నారాయణపై నమ్మకం ఉంచిన సందర్భం విజయవాడ వరదలు మాత్రమే.

విజయవాడ నగరంలోకి వరద ప్రవేశించాక ప్రభుత్వానికి కాళ్లూ చేతులు ఆడని పరిస్ధితి. అలాంటి సమయంలో రంగంలోకి దిగిన మున్సిపల్ మంత్రి నారాయణ ముందుగా బాధితులకు ఆహారం, తాగునీరు, మందులు, నిత్యావసరాల పంపిణీపై ఫోకస్ పెట్టారు. స్వయంగా బోట్లలో విస్తృతంగా తిరుగుతూ బాధిత ప్రాంతాలకు కనీస అవసరాలు తీరుతున్నాయో లేదో పర్యవేక్షించారు. దీంతో ఆ తర్వాత చంద్రబాబు బోట్లపై పరిశీలనకు వచ్చినా కనీస అవసరాల విషయంలో ఎవరూ ఫిర్యాదు చేయలేదు. వారం రోజులుగా బాధితులకు సకాలంలో కనీస అవసరాలు తీరుతున్నాయంటే అతి మంత్రి నారాయణ చలవే అనడంలో అతిశయోక్తి లేదు.

బెజవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు కనీస అవసరాలు తీర్చడంతో ప్రభుత్వం పని అయిపోలేదు. వరద తగ్గాక అక్కడ ఉండే బురద, అంటువ్యాధుల భయం చాలా కీలకం. అందుకే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి సైతం ఫైర్ ఇంజన్లను భారీగా రప్పించి నగరంలో వరద తగ్గిన ప్రాంతాల్లో నారాయణ బురదను తోడించే పని మొదలుపెట్టించారు. అంతే కాదు అంటువ్యాధులు ప్రబలకుండా భారీ ఎత్తున పారిశుధ్య పనులు చేపట్టారు. రెండు రోజులుగా వరద తగ్గిన ప్రాంతాల్లో ఇళ్లకు వెళ్లి ఫైరింజన్లు బురద తోడటంతో పాటు కడిగే పని చూస్తున్నాయి. క్లీనింగ్ పూర్తి కాగానే శానిటేషన్ కోసం క్లోరిన్ చల్లడం, మందుల పంపిణీ వంటి చర్యలు చేపడుతున్నారు. అటు రెండు రోజులుగా బాధితులకు భారీ ఎత్తున నిత్యావసరాల పంపిణీ కూడా మొదలైంది. ఇందులో ప్రతీ పనిలోనూ నారాయణ ముద్ర కనిపిస్తోంది. మొత్తంగా బెజవాడ వరద బాధితులకు నారాయణ ఇచ్చిన భరోసా ప్రభుత్వానికి సైతం మంచిపేరు తెచ్చిపెడుతోంది.