మెగా9, వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఇటీవల కడప దర్గాకు వెళ్లి వివాదాల్లో చిక్కుకున్నారు. సాధారణంగా చరణ్ దర్గాకి వెళ్తే గొడవ ఏమీ ఉండేది కాదు, కానీ ఆయన ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉండి దర్గాకు వెళ్లడం ఇప్పుడు వివాదానికి దారి తీసింది.
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌కు ఇచ్చిన మాట ప్రకారం, కడప అమీన్ పీర్ దర్గాలో నిర్వహిస్తున్న 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్‌కు నవంబర్ 18న ముఖ్య అతిథిగా హీరో రామ్ చరణ్ వెళ్లారు.
అయితే రామ్ చరణ్ కడప దర్గాను అయ్యప్ప మాలలో ఉండి సందర్శించుకోవడంపై పలు హిందూ సంఘాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. “దర్గా అంటే ఓ సమాధి. సమాధిని సందర్శించి వస్తే మాల తీసేయాలి కదా” అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఓ నెటిజన్ రామ్ చరణ్ సతీమణి ఉపాసనను ట్యాగ్ చేస్తూ, “మేడం, ఇతర మతాలను గౌరవించడం అంటే మీరు అయ్యప్ప మాలలో వారి దర్గాకు వెళ్లడం కాదు. వారి విశ్వాసాన్ని అవమానించకుండా, మన మతంలో జోక్యం చేసుకోకుండా వారు చేసే వాటిని గౌరవించడం ద్వారానే మతాన్ని గౌరవించగలుగుతాం” అంటూ ట్వీట్ చేశాడు.
దీంతో ఉపాసన సోషల్ మీడియాలో ఒక స్పెషల్ నోట్ షేర్ చేశారు.
“విశ్వాసం ఏకం చేస్తుంది, అది ఎప్పటికీ విడిపోదు. భారతీయులుగా మనం దైవానికి సంబంధించిన అన్ని మార్గాలను గౌరవిస్తాము. మన బలం ఐక్యతలోనే ఉంది. ఎల్లప్పుడూ రామ్ చరణ్ తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను గౌరవిస్తాడు. వన్ నేషన్ వన్ స్పిరిట్.. జైహింద్” అంటూ చరణ్ దర్గాలో ఉన్న ఫోటోను షేర్ చేశారు.
దీంతో “మా ఆయన దర్గాకు వెళ్తే తప్పేంటి?” అంటూ ఉపాసన పోస్ట్ చేసిన వెంటనే విమర్శలు చేస్తున్న నెటిజన్లకు క్లారిటీ ఇచ్చేశారు.