విశాఖలో దారుణం…లా స్టూడెంట్‌పై గ్యాంగ్ రేప్

ఆంద్రప్రదేశ్, మెగా9 వెబ్ డెస్క్ : విశాఖలో దారుణం చోటుచేసుకుంది. లా చదువుతున్న యువతిపై నలుగురు సహచర విద్యార్థులు పథకం ప్రకారం నమ్మించి, యువతిని తోటి విద్యార్థులే సామూహిక అత్యాచారం చేశారు. దీంతో ఒక్కసారిగా విశాఖపట్నం ఉలిక్కిపడింది.

నగరానికి చెందిన ఓ యువతికి సహ విద్యార్థి వంశీతో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఈ ఏడాది ఆగస్టు 10న కంబాలకొండకు వెళ్లిన సమయంలో యువతి నిరాకరించినా, వంశీ బలవంతంగా శారీరకంగా కలిశాడు.

ఆగస్టు 13న వంశీ ఆ యువతిని ద్విచక్రవాహనంపై తన స్నేహితుడు ఆనంద్ గదికి తీసుకెళ్లాడు. అక్కడ బలవంతం చేసి మరోమారు శారీరకంగా కలిశాడు. దాన్ని రహస్యంగా వీడియో తీసిన ఆనంద్, రాజేష్, జగదీష్ గదిలోకి వచ్చి ఆమెను బెదిరించారు. తరువాత ఒక్కొక్కరుగా అత్యాచారం చేశారు. నిందితుల్లో ముగ్గురు విద్యార్థులు కాగా, ఒకరు ఓ ప్రైవేటు మోటార్స్ కంపెనీలో క్యాషియర్‌గా పనిచేస్తున్నారు.

ఉరివేసుకుని ఆత్మహత్యయత్నం:
ప్రియుడే దగ్గరుండి స్నేహితులతో అత్యాచారం చేయించడంతో బాధితురాలు నిలదీసింది. ఆ తర్వాత అతను యువతిని బెదిరించడం మొదలుపెట్టాడు. విషయం బయటకు తెలిస్తే కుటుంబం పరువు పోతుందని భావించి బాధితురాలు మౌనం వహించింది. కళాశాలకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉండిపోయింది. మళ్లీ తమ కోరిక తీర్చాలంటూ రెండు నెలలుగా వంశీ స్నేహితులు ఫోన్ చేసి వేధింపులకు గురి చేశారు. వంశీ కూడా ఫోన్ చేసి స్నేహితులు చెప్పినట్లు చేయాలని చెప్పడంతో బాధితురాలు సోమవారం తెల్లవారుజామున ఉరివేసుకుని చనిపోయేందుకు యత్నించింది. కుటుంబసభ్యులు ఆమెను కాపాడి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నిందితులు నలుగుర్ని పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండ:
విశాఖలో గ్యాంగ్ రేప్ ఘటన దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత తెలిపారు. అత్యాచారానికి పాల్పడ్డ యువకులకు కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులను ఆదేశించారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.