అంబటికి గట్టి షాక్ తగలబోతోందా ? జగన్ కరుణించినా అక్కడ ఝలక్..!

పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి రాజకీయాలది ప్రత్యేక స్థానం. ఈ నియోజకవర్గం నుండి స్థానికుల కంటే స్థానికేతరులకే ఆయా పార్టీలు అధిక ప్రాధాన్యం కల్పిస్తాయి. వైసీపీ ఆవిర్భావం నుండి సత్తెనపల్లి లో అంబటి రాంబాబు పార్టీ బాధ్యతలు చూసుకునే వారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్ధి కోడెల శివప్రసాదరావు చేతిలో స్వల్ప ఓట్లతో ఓడిపోయిన అంబటి.. ఆ తరువాత 2019 ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిచి మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. అయితే ఇప్పుడు అధికారం పోయాక మళ్లీ కష్టాలు మొదలయ్యాయి.అయితే అవి బయటి నుంచి కాకుండా పార్టీలోనే కావడం చర్చనీయాంశంగా మారింది.

సత్తెనపల్లిలో ఎమ్మెల్యేగా అంబటి రాంబాబు గెలిచిన నాటి నుండి ఆయన చుట్టూ అన్నీ వివాదాలే. ఐతే పార్టీ తరఫున గట్టిగా వాయిస్ వినిపించే అతికొద్ది మందిలో అంబటి ఒకరు కావడంతో ఆయన పై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా అధిష్టానం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. 2024 ఎన్నికల ముందు నియోజకవర్గం లోని రాజకీయ ప్రముఖులు అంబటికి టికెట్ ఇవ్వొద్దని అధిష్టానానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారి మాటలను పెడచెవిన పెట్టి అధిష్టానం మళ్ళీ అంబటికే అవకాశం కల్పించింది. గత ఎన్నికల్లో కూటమి హవాలో టీడీపీ అభ్యర్ధి కన్నా లక్ష్మీనారాయణ చేతిలో ఆయన ఘోరంగా ఓడిపోయారు.

అంతవరకూ ఓ ఎత్తయితే ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్న పరిస్ధితులు మరో ఎత్తుగా మారిపోయాయి. తాజాగా గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా జగన్ అంబటికి బాధ్యతలు అప్పగించారు. కానీ అంబటి వ్యవహారశైలిలో మాత్రం ఏ మార్పూ లేదు. దీంతో అసలే అధికారం దూరమై కొండంత బాధలో ఉన్న వైసీపీ కేడర్.. తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమౌతున్నారు. దీనికి తోడు అధికార కూటమి ప్రభుత్వంలోని ప్రత్యర్ధుల దాటికి బెంబేలెత్తిపోతున్నారు.

మరో వైపు తిరుపతి లడ్డూ లో కల్తీనెయ్యి అంశంతో జాతీయస్థాయిలో పార్టీ ప్రతిష్ట మసకబారుతున్న వేళ అధినేత జగన్ కే తలబొప్పికడుతుంటే ఇక తమగోడు వినేతీరిక ఆయనకు ఎక్కడుంటుందని సత్తెనపల్లిలో వైసీపీ క్యాడర్ గుసగుసలాడుకుంటున్నారు. అందుకే తలోదారిచూసుకోవడం మంచిదని వారంతా పక్కచూపులు చూస్తున్నారు.