ఈసారైనా జనం నో అనకుండా ఉండాలంటే ఆ ఎస్ లతో జాగ్రత్తన్నా ; జగన్ కు పార్టీ నేతల రిక్వెస్ట్

వైసీపీ అధినేత జగన్.. ఎట్టకేలకు జనంలోకి వచ్చారు. పార్టీ ఘోర ఓటమి తర్వాత నెలన్నర రోజులకు ఆయన పూర్తిస్థాయిలో జనం ముందుకు వచ్చారు. అధికారంలో ఉన్నపుడు జనానికి దూరమవుతున్నామన్నా…కేవలం బటన్ లు నొక్కితే ఉపయోగం లేదని పార్టీ నేతలు ఎంత చెప్పినా…వినకుండా ఉన్న జగన్..ఇప్పుడు వినుకొండ పర్యటనతో నేను ఉన్నా…మీ సమస్యలు వింటున్నా..అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఈసారైనా జనం మనల్ని చూసి నో చెప్పకుండా ఉండాలంటే పార్టీలో ఉన్న ఆ ఇద్దరు ఎస్ లతో జాగ్రత్త అంటున్నారట. మరి ఆ ఇద్దరు ఎస్ లు ఎవరు..? వారితో పార్టీకి వచ్చిన తంటా ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ స్టోరీ చూసేయండి మరి.

సార్వత్రిక ఎన్నికలు ముగిసి నెలన్నరరోజులు అయిన తర్వాత వైసీపీ అధినేత జగన్ పూర్తిస్థాయి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఫలితాల రోజు మీడియా ముందుకు వచ్చి తన ఆవేదన వ్యక్తం చేసిన జగన్, ఆ తర్వాత కొద్దిరోజలకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ని కలిసేందుకు నెల్లూరు జైలుకెళ్లారు. ఆపై పూర్తిగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన పాలనలో జరిగిన అవకతవకలపై దృష్టిపెట్టిన నేపథ్యంలో…ఆయన బెంగుళూరు, పులివెందుల్లో పర్యటిస్తూ తదుపరి రాజకీయ కార్యాచరణకు వ్యూహరచన చేస్తున్నారు. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి పనిచేసేందుకు కొంత సమయం ఇచ్చిన తర్వాత స్పందిద్దామని భావించినప్పటికీ…వినుకొండలో జరిగిన కార్యకర్త హత్య ఒక్కసారిగా ఏపీ రాజకీయాన్ని హీటెక్కిచ్చింది. జగన్ ను కార్యక్షేత్రంలో అడుగుపెట్టేలా చేసింది.

దీంతో కారణాలేవైనా సరే…పార్టీ కార్యకర్త చనిపోవటం..కొద్దిరోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో తన పొలిటికల్ రీఎంట్రీకి ఇదే సరైనసమయమని భావించిన జగన్, వినుకొండపర్యటనను సమర్ధవంతంగా ఉపయోగించుకున్నారు. చనిపోయిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడంతోపాటు నెలన్నర రోజుల కూటమి పాలనపై జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏకంగా రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన పెట్టేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపిలకు సైతం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఆకృత్యాలను పార్లమెంటులో ప్రస్తావించాలని వారిని ఆదేశించారు. మరోవైపు ఈనెల 24న ఢిల్లీలో ధర్నాకు పిలుపునిస్తూ.. ఇకపై తాను యాక్టివ్ గా ఉంటానన్న సంకేతాలను పార్టీ క్యాడర్ కు, నేతలకూ జగన్ పంపించారు.

అయితే ఇదే సమయంలో పార్టీ క్యాడర్ నుండి, నేతల నుండి జగన్ కు కొన్ని సలహాలు అందుతున్నాయట. మనకు అధికారంలో ఉన్న సమయంలో మీ దృష్టికి పూర్తివాస్తవాలు రాకుండా ఇద్దరు నేతలు మొత్తం నాశనం చేశారని వాపోతున్నారట. అందులో ఒకరు సజ్జల అయితే మరొకరు సాయిరెడ్డి అని ఆ ఇద్దరిపై ఉన్న విషయాలను కుండబద్ధలు కొడుతున్నారట. సజ్జల అయితే తానే మొత్తం పవర్ సెంటర్ గా మారి పాలన అంటే సజ్జల చెబితేనే జరుగుతుందన్న విధంగా వ్యవహరించారని నాడు జరిగిన తతంగంపై జగన్ కు ఫిర్యాదు చేస్తున్నారట. మంత్రులకు సంబంధించిన శాఖల గురించి కూడా తానే మాట్లాడి సకలశాఖామంత్రిగా జనంలో పార్టీ పలుచనయ్యేలా వ్యవహరించారనీ, పార్టీ ఓటమికి సగం కారణం అతనే అని జగన్ కు గుర్తు చేస్తున్నారట. ఇక సాయిరెడ్డి అయితే ఉత్తరాంధ్రలో పార్టీ ఊసే లేకుండా అవటానికి ఆయనే కారణమని ఘొల్లుమంటున్నారట. వైజాగ్ చుట్టుపక్కల భూములపై కన్నేసి వైజాగ్ కు తాము ఇచ్చిన ప్రాధాన్యత భూములను కొట్టేసేందుకే అన్నట్లు ప్రజల్లోకి వ్యవహరించి ఆ ప్రాంతంలో పార్టీ వాష్ అవుట్ అవటానికి కారణమయ్యారని నాటి తప్పుల్ని ఎత్తిచూపుతున్నారట. ఇదంతా ఒక ఎత్తయితే ఇప్పుడు దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఎపిసోడ్ తో పార్టీ పరువు నడిరోడ్డుకు తెచ్చారనీ, కాబట్టి ఇకపై పార్టీపరంగా తీసుకునే కార్యక్రమాలకు ఆ ఇద్దరినీ దూరంగా పెట్టి..నేతలకు, పార్టీ క్యాడర్ కు అందుబాటులో ఉండమని అధినేతకు సలహాలిస్తున్నారట. అంతేకాదు..మళ్లీ ఆ ఇద్దరికీ ఒకరంటే మరొకరికి పడకపోవటం…ఇద్దరూ వేర్వేరు కోటరీలు నిర్వహించి ఒకరి లొసుగులు మరొకరు బయటేసుకోవటంతో పార్టీకి జరిగిన నష్టం ఫలితం 11 సీట్లని వారు జగన్ కు గుర్తు చేస్తున్నారట.

మొత్తంగా కొంతమంది బూతు నేతల నోటి దురదకు, ఆ తర్వాత సాయిరెడ్డి, సజ్జల ఓవరాక్షన్ కు జనం మనకు ఐదేళ్ల కఠిన శిక్ష వేశారనీ, మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు వచ్చే అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ రేసులోకి వెళ్లాలంటే కచ్చితంగా ఈసారైనా బటన్ లనూ, బడాయి వాళ్లనూ నమ్ముకోవద్దని జగన్ కు హితవు పలుకుతున్నారట. మరి.. ప్రస్తుత రాజకీయంలో కాస్తంత పొలిటికల్ ఊపు తెచ్చిన జగన్, ఈ సలహాలూ, సూచనలూ తీసుకుని ఆ ఇద్దరిని దూరంగా పెడతారా..? లేక తన పాతధోరణినే కొనసాగిస్తారా అన్నది వేచిచూడాలి.