తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కొన్ని రోజులుగా ప్రత్యర్దులపై మాటల తూటాలు పేలుస్తున్నారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ కౌశిక్ రెడ్డి చేస్తున్న విమర్శలు, వాటికి పడుతున్న కౌంటర్లు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయాయి. అయితే ఇంత సడన్ గా కౌశిక్ రెడ్డి మాటల దాడి చేయడం వెనుక ఏముంది ? ఈ దూకుడుతో కౌశిక్ రెడ్డి కానీ, ఆయన పార్టీ బీఆర్ఎస్ కానీ ఏం ఆశిస్తున్నాయి తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ..!
గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దూకుడు చూస్తుంటే దీని వెనుక ఏదో ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ లోకి ఫిరాయించిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. అదే జరిగితే రాష్ట్రంలో ఉపఎన్నికలు తప్పవన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. అప్పుడు తిరిగి నెగ్గాలంటే ఏదో ఒక పెద్ద అస్త్రం అవసరం. సరిగ్గా ఇప్పుడు దాన్ని అందిపుచ్చుకునే పనిలో బీఆర్ఎస్ బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగమే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దూకుడు అన్న చర్చ జరుగుతోంది.
తెలంగాణాలో ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వస్తే తమకు అనుకూలంగా మలచుకోవడానికి బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే కౌశిక్‌రెడ్డి దూకుడుగా వెళ్తున్నారనే టాక్ వినిపిస్తోంది. రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల్ని చూస్తే కౌశిక్ రెడ్డి భారీ డైలాగులతో ప్రత్యర్దుల్ని కవ్విస్తున్నారు. ఎక్కడ నుంచో గాంధీ బతకడానికి తెలంగాణాకు వచ్చి తెలంగాణా వారి మీదనే దాడి చేస్తారా అంటూ ప్రాంతీయవాదాన్ని కూడా ఆయన రెచ్చగొడుతున్నారు.దీన్ని చూస్తుంటే బీఆర్ఎస్ మళ్లీ ప్రాంతీయ వాదాన్నే అస్త్రంగా మల్చుకోనుందా అన్న చర్చ సాగుతోంది.
తెలంగాణాలో ప్రస్తుతం దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల అనర్హత పిటీషన్లను నాలుగు వారాలలో తేల్చాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఒక వేళ నిర్ణయం తీసుకోకుంటే తామే సుమోటోగా మరోసారి విచారిస్తామని చెప్పింది. దీంతో ఈ ముగ్గురు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు కాస్త అటు ఇటులో ఖాయం అనే చెప్పాలి. మరోవైపు అక్టోబర్ 9వ తేదీలోగా 16 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటే అప్పుడు బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అవుతుంది. లేదంటే పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు డేంజర్ బెల్స్ తప్పవు. దీంతో 16 మంది ఎమ్మెల్యేలను తమ ఖాతాలో వేసుకునేందుకు రేవంత్ టీమ్ అంతర్మథనం చెందుతోంది.
మరోవైపు దేశంలో పార్టీ ఫిరాయింపుల మీద యుద్ధం చేస్తున్న కాంగ్రెస్ తెలంగాణలో మళ్లీ అవే ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం ఆ పార్టీ పెద్దలకు ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పై మరింత ఒత్తిడి పెంచడంతో పాటు తమ పార్టీని రక్షించుకునేందుకు బీఆర్ఎస్ కౌశిక్ రెడ్డిని అడ్డుపెట్టి తెలంగాణ వాదాన్ని తెరపైకి తెస్తోందన్న ప్రచారం జరుగుతోంది. దీనికి కౌంటర్ గా కాంగ్రెస్ ఏం చేయబోతోందన్న ఆసక్తి పెరుగుతోంది.