తెలంగాణను గజగజ వణికిస్తున్న చలిపులి

మెగా9 వెబ్ డెస్క్ : చలికాలం ప్రారంభంలోనే జనం వణికిపోతున్నారు. తెలంగాణలో నాలుగు, ఐదు రోజులుగా వాతావరణంలో అనూహ్యంగా ఉష్ణోగ్రతలలో మార్పులు చోటు చేసుకున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నాయి.
పగటిపూట ఉష్ణోగ్రతలు సైతం క్రమంగా తగ్గుతున్నాయి. ఉదయం 10 గంటల వరకు చాలా ప్రాంతాల్లో పొగమంచు కప్పేస్తోంది. పొగమంచు కారణంగా రహదారులపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

రాష్ట్రంలో గరిష్టంగా గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ రెండు జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోతున్నట్లు అధికారులు వివరించారు. ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ చలిపులి పంజా విసురుతోంది. కొన్ని ఏరియాల్లో 15 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రివేళ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.