100 రోజుల పాలనపై సోనూసూద్ కీలక వ్యాఖ్యలు..!

ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల్లో సీఎం చంద్రబాబు పాలనపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఈ వంద రోజుల్లో ప్రభుత్వం చేసిందేమి లేదని వైసీపీ నుంచి విమర్శలొస్తుంటే.. క్లిష్ట పరిస్థితుల్లో కూడా పెన్షన్ పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అన్న క్యాంటిన్లు వంటి పథకాలను అమలు చేయడంతో పాటు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్న ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని టీడీపీ చెబుతోంది. మరికొందరేమో వందరోజుల్లోనే ప్రభుత్వ పాలనపై ఓ అంచనాకు రావడం సరికాదని కూటమి ప్రభుత్వంపై రకరకాల అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఏపీలో కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనను ఉద్దేశిస్తూ సీఎం చంద్రబాబు నాయుడుపై కీలక వ్యాఖ్యలు చేశారు నటుడు సోనూసూద్. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే సీఎం చంద్రబాబు తన మార్క్ చూపించారన్నారు. ప్రజలు సురక్షితంగా ఉండేలా చూసుకుంటున్నారని ప్రశంసించారు. స్పష్టమైన విజన్ తో ఆయన ముందుకు వెళుతున్నారని, సీఎం చంద్రబాబును చూస్తే గర్వంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. ఆయన్ను త్వరలోనే కలుస్తానని, ఏపీ అభివృద్ధికి తన వంతు కృషికి చేస్తానని నటుడు సోనూసూద్ అన్నారు.

ఇకపోతే నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన సోనూసూద్.. కరోనా టైంలో ప్రజలకు అండగా తనవంతు సాయం చేస్తూ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ప్రజలకు సామజిక సేవ చేయడంలో ఎప్పుడూ ముందుండే ఆయన.. సీఎం చంద్రబాబు పాలనపై సానుకూలంగా వ్యాఖ్యానించడంతో అయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.