మహారాష్ట్ర కొత్త డీజీపీగా ‘ముంబై హీరో’ సదానంద్ దాతే నియామకం!

Spread the love

మహారాష్ట్ర పోలీస్ దళానికి నూతన సారథిగా సీనియర్ ఐపీఎస్ అధికారి, 26/11 ముంబై ఉగ్రదాడుల సమయంలో అసామాన్య ధైర్యసాహసాలు ప్రదర్శించిన సదానంద్ వసంత్ దాతే నియమితులయ్యారు.ప్రస్తుతం డీజీపీగా ఉన్న రష్మీ శుక్లా జనవరి 3న పదవీ విరమణ చేయనుండటంతో, ఆమె స్థానంలో దాతేను నియమిస్తూ…మహారాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 1990 బ్యాచ్‌కు చెందిన ఆయన, ఇటీవలే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) చీఫ్‌గా కేంద్ర సర్వీసుల నుండి తిరిగి రాష్ట్ర కేడర్‌కు వచ్చారు.సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఆయన రెండేళ్ల పాటు ఈ అత్యున్నత పదవిలో కొనసాగనున్నారు.సుమారు 2 లక్షల మంది బలగమున్న మహారాష్ట్ర పోలీస్ విభాగానికి ఆయన నాయకత్వం వహించడం గమనార్హం.

సదానంద్ దాతే పేరు వినగానే 26/11 ముంబై దాడుల వీరోచిత పోరాటం గుర్తొస్తుంది.నాడు కామా ఆసుపత్రిలో ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, అబు ఇస్మాయిల్‌లతో నేరుగా తలపడి, గ్రెనేడ్ దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ వెనక్కి తగ్గకుండా పోరాడి ఎందరో ప్రాణాలను కాపాడారు.ఆయన ధైర్యానికి గుర్తింపుగా ప్రభుత్వం రాష్ట్రపతి శౌర్య పతకంతో సత్కరించింది.ఏటీఎస్ చీఫ్‌గా, మీరా-భయందర్ తొలి కమిషనర్‌గా, సీబీఐ మరియు సీఆర్పీఎఫ్‌లలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉన్న అధికారిగా పేరుంది.పోలీస్ అధికారిగానే కాకుండా, ఆయన పుణే యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందారు.