ఏపీ సీఎం నారా చంద్రబాబు 2026 నూతన సంవత్సరానికి వినూత్నంగా స్వాగతం పలికారు. జనవరి 1వ తేదీ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశమైన అరకు లోయ దగ్గర ఉదయించిన ఈ ఏడాది మొదటి సూర్యోదయం వీడియోను ఆయన తన సోషల్ మీడియా ‘ఎక్స్’ ద్వారా షేర్ చేశారు. ఈ అద్భుతమైన దృశ్యాలతో పాటు, రాష్ట్రాన్ని ‘సన్‌రైజ్ స్టేట్’గా అభివర్ణిస్తూ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
సూర్యోదయానికి సంబంధించిన ఈ వీడియో ఎంతో ఆహ్లాదంగా ఉండడంతో పోస్ట్ చేసిన కొద్ది సమయంలోనే ఈ వీడియోకు వేలాది వ్యూస్ రావడంతో పాటు, నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ పోస్ట్‌పై స్పందిస్తున్న నెటిజన్లు, అరకు అందాలను మరింతగా ప్రచారం చేసేందుకు ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహించాలని సూచించారు. మరికొందరు తిరుమల వంటి పుణ్యక్షేత్రాల్లో తాము చూసిన సూర్యోదయ అనుభవాలను పంచుకున్నారు. దేశవ్యాప్తంగా అయోధ్య, గువాహటి వంటి ప్రాంతాల నుంచి కూడా తొలి సూర్యోదయం వీడియోలు షేర్ అయిన నేపథ్యంలో, ఏపీ సీఎం పోస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.