రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ నేడు కీలక ప్రకటన చేశారు. వందేభారత్ స్లీపర్ రైళ్లు సంబంధించి మొదటి రైలు కోల్ కతా- గువాహటిల మధ్య అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా త్వరలో ప్రారంభం కానుందని పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్-అస్సాం మధ్య నడిచే ఈ రైల్లోని టికెట్ ధరలు.. విమాన టికెట్ ధరల కంటే తక్కువే ఉంటాయని తెలిపారు. ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాబోయే 15-20 రోజుల్లో ఈ రైలు అందుబాటులోకి రానుందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. జనవరి 18-19 తేదీల్లో ఈ ప్రారంభోత్సవం ఉండొచ్చని తెలిపారు. రైలు ప్రారంభోత్సవం గురించి ప్రధాని మోదీకి తెలియజేసినట్లు వివరించారు. రాబోయే 2-3 రోజుల్లో ప్రారంభోత్సవ తేదీ వివరాలను ప్రకటిస్తానని తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య విమాన ప్రయాణానికి రూ.6 వేలు నుంచి 8 వేలు ఖర్చవుతోందని వందేభారత్ స్లీపర్లో 3 ఏసీలో టికెట్ ధర (ఫుడ్ కూడా) సుమారు రూ.2,300, 2ఏసీ ధర సుమారు రూ.3 వేలు, 1ఏసీ ధర సుమారు రూ.3,600 ఉండొచ్చని తెలిపారు. మధ్యతరగతికి అందుబాటులో ఉండేవిధంగా టికెట్ ధరలు నిర్ణయించినట్లు చెప్పారు.