డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2025 ఏడాదంతా కూడా నియోజకవర్గ, జిల్లా స్థాయి పనితీరుపై నిరంతర సమీక్షలు నిర్వహిస్తూ పాలనలో అత్యంత చురుగ్గా వ్యవహరించారు. తన పాలనా నిర్ణయాల్లో ఎక్కువగా ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యతనివ్వడం అదేవిధంగా స్థానిక అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని మరియు ప్రభుత్వ సేవలను ప్రజలకు సకాలంలో అందించాలని తరచుగా ఆయన ఎమ్మెల్యేలను, అధికారులను సమాయత్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాలకు అత్యంత కీలకమైన పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం మరియు అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి శాఖల బాధ్యతలను సమర్ధవంతమైన నిర్ణయాలతో నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ శాఖల ద్వారా పాలనా వ్యవస్థలు, మౌలిక సదుపాయాల కల్పన, సహజ వనరుల నిర్వహణ మరియు గ్రామీణ జీవనోపాధి మెరుగుదల వంటి అంశాలు ఆయన పనితీరుకు అద్దం పడుతున్నాయి.
పరిపాలనా అనుభవం తక్కువైనా కూడా ఆయన క్షేత్రస్థాయి పర్యటనలు, అధికారులతో ప్రత్యక్ష చర్చల ద్వారా పనుల వేగవంతానికి కృషి చేస్తూ క్రియాశీలక పాత్ర పోషించారు.పవన్ కళ్యాణ్ తన శాఖలలో సాధించిన ముఖ్యమైన విజయాలు మరియు అవలంభించిన అభివృద్ధి కార్యక్రమాలు ఒకసారి మనం నిశితంగా పరిశీలిస్తే..
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామాల్లో ఏకకాలంలో గ్రామ సభలు నిర్వహించడం ఒక చారిత్రాత్మక ఘట్టం. నిర్ణయాధికారాన్ని నేరుగా గ్రామస్తులకే అప్పగించడం, స్థానిక అవసరాలకు ప్రాధాన్యతనివ్వడం మరియు అభివృద్ధి పనుల పర్యవేక్షణను పటిష్టం చేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. దీనికి జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కడం విశేషం. అలాగే పంచాయతీ రాజ్ పాలనలో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయి ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని నాలుగు గ్రామ పంచాయతీలు జాతీయ పంచాయతీ పురస్కారాలను కూడా అందుకున్నాయి. వికేంద్రీకృత పాలనను బలోపేతం చేసేందుకు 77 డివిజనల్ డెవలప్‌మెంట్ కార్యాలయాలను ప్రారంభించడం కూడా కీలక మైలురాయి. ఇక మరోవైపు గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ‘పల్లె పండుగ’ మొదటి దశలో 4,000 కి.మీ కంటే ఎక్కువ సిమెంటు కాంక్రీటు (CC) రోడ్లు మరియు 22,500లకు పైగా మినీ గోకులాల నిర్మాణం. ‘పల్లె పండుగ 2.0’ కింద మరో 8,571 కి.మీ రోడ్లకు అనుమతులు ఇవ్వడం. అలాగే, 1,312 కి.మీ బీటీ రోడ్ల ద్వారా 419 జనావాసాలకు తొలిసారిగా రవాణా సౌకర్యం కల్పించారు. గ్రామీణ నీటి సరఫరా రంగంలో భాగంగా 3,778 పనులను పూర్తి చేసి, 54,000 కంటే ఎక్కువ గృహాలకు కుళాయి కనెక్షన్లను అందించారు. అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యతను కాపాడేందుకు కూడా పవన్ కళ్యాణ్ విశేషంగా కృషి చేశారు. రాష్ట్రంలో హరిత విస్తీర్ణం 30.05 శాతానికి పెరిగింది, సుమారు 97,000 హెక్టార్లలో మొక్కలు నాటారు. అటవీ అగ్నిప్రమాదాలు గతంతో పోలిస్తే 24 శాతం తగ్గడం వంటి అంశాలు పవన్ పాలనా సమర్ధతకు నిదర్శనం.