బలూచిస్తాన్ లో చైనా సైన్యం మోహరింపుపై జైశంకర్‌కు మీర్ యార్ బలూచ్ సంచలన లేఖ!

Spread the love

నవంబర్ 2026 నూతన సంవత్సర సందర్భాన్ని పురస్కరించుకుని బలూచిస్తాన్ ప్రతినిధి మీర్ యార్ బలూచ్, భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్‌కు రాసిన బహిరంగ లేఖ అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.ఆరు కోట్ల బలూచ్ ప్రజల తరపున భారత్‌కు శుభాకాంక్షలు తెలుపుతూనే, పాకిస్థాన్-చైనా కూటమి వల్ల భారత్ – బలూచిస్తాన్ ఎదుర్కోబోయే పెను ముప్పు గురించి ఆయన తీవ్రంగా హెచ్చరించారు. గతేడాది పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ప్రధాని మోదీ ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. పాకిస్థాన్ సైన్యం అండతో నడుస్తున్న ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన మెరుపు దాడులు ప్రాంతీయ భద్రత పట్ల భారత్ యొక్క నిబద్ధతను చాటుతున్నాయని ఆయన ప్రశంసించారు. భారత్ – బలూచిస్తాన్ మధ్య శతాబ్దాల నాటి చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని, ముఖ్యంగా హింగ్లాజ్ మాత ఆలయం (నానీ మందిర్) మన ఉమ్మడి ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక అని ఆయన గుర్తు చేశారు.

మరోవైపు, బలూచిస్తాన్‌లో చైనా సైన్యం (Chinese Boots) మోహరింపుపై మీర్ యార్ బలూచ్ సంచలన హెచ్చరికలు చేశారు. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) పనులు చివరి దశకు చేరుకున్నాయని, రాబోయే కొద్ది నెలల్లోనే చైనా తన సైనిక బలగాలను బలూచ్ గడ్డపై దించే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బలూచ్ స్వాతంత్య్ర దళాలను మరింత బలోపేతం చేయకపోతే, చైనా విస్తరణవాదం భారత్ మరియు బలూచిస్తాన్ భవిష్యత్తుకు ఊహించని ముప్పుగా పరిణమిస్తుందని పేర్కొన్నారు. చైనా-పాకిస్థాన్ వ్యూహాత్మక కుట్రలు అత్యంత ప్రమాదకరమైనవని, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో భారత్ – బలూచిస్తాన్ మధ్య సంబంధాలు కేవలం మాటలకే పరిమితం కాకుండా, ప్రత్యక్ష కార్యాచరణలో కనిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.