మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సింగపూర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అక్కడ నివసిస్తున్న తెలుగు వారందరినీ కలవడం ఆనందదాయకం. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా… భరతమాత గౌరవాన్ని పెంచాలన్న శ్రీ రాయప్రోలు వారి స్ఫూర్తితో సింగపూర్ లోని తెలుగువారు మన భాషా సంస్కృతులను కాపాడుకోవడంతో పాటు, ఇక్కడి అభివృద్ధిలో భాగస్వాములు కావడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆకాంక్షించారు. నిర్వహణ బృందానికి అభినందనలు తెలిపారు. మన భాషలో మన సంస్కృతి ఉందని మాతృభాష మన ప్రతి ఒక్కరి ఇంటి భాష కావాలని అన్నారు. మన కట్టు, బొట్టు, మన భాష, ప్రాస, యాస, మన గోస… మనమెప్పుడూ విడవరాదని సూచించారు. మనపద్యం, గద్యం, మన పండుగలు, పబ్బాలు, ఉత్సవాలు అన్నింటినీ గౌరవించుకోవాలి. ఎక్కడ ఉన్నా శ్రద్ధగా జరుపుకోవాలి. భాష సంస్కృతులను కాపాడుకోవడంతో పాటు నలుగురికి సాయం చేయడం మరువకూడదని సూచించారు. ఇక్కడ కష్టపడండి, సంపాదించండి, తిరిగి మన దేశానికి వచ్చి సేవ చేయండి. మీ అందరినీ సాదరంగా భారతదేశానికి ఆహ్వానించారు. ఇక ఈ పర్యటనలో భాగంగా అక్కడి రామకృష్ణ మఠాన్ని సందర్శించారు.