రైహాన్ వాద్రా చిన్ననాటి స్నేహితురాలు అవివా బేగ్‌తో నిశ్చితార్థం!

Spread the love

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు రైహాన్ వాద్రా త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నారు.తన చిరకాల స్నేహితురాలు అవివా బేగ్‌తో ఆయన నిశ్చితార్థం రాజస్థాన్‌లోని రణథంబోర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వైభవంగా జరిగింది. ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట, ఇరు కుటుంబాల అంగీకారంతో తమ బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్తున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను వారు సోషల్ మీడియాలో పంచుకోగా, అందులో రైహాన్ డార్క్ షేర్వాణీలో, అవివా ఎంబెల్లిష్డ్ శారీలో మెరిసిపోయారు. తమ స్నేహం ఎంత పురాతనమైనదో గుర్తుచేస్తూ వారు చిన్ననాటి ఫొటోను కూడా షేర్ చేయడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

అవివా బేగ్ ఢిల్లీకి చెందిన ప్రముఖ కుటుంబానికి చెందిన వారు. ఆమె తండ్రి ఇమ్రాన్ బేగ్ వ్యాపారవేత్త కాగా, తల్లి నందితా బేగ్ ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్.నందితకు ప్రియాంకా గాంధీతో దశాబ్దాల కాలంగా మంచి స్నేహం ఉంది.కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ‘ఇందిరా భవన్’ ఇంటీరియర్ డిజైనింగ్‌లో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు.అవివా ఢిల్లీలోని మోడరన్ స్కూల్‌లో చదివి,ఆ తర్వాత జర్నలిజం అభ్యసించారు. ప్రస్తుతం ఆమె కూడా ఇంటీరియర్ డిజైనర్‌గా, ఫొటోగ్రాఫర్‌గా రాణిస్తూనే ‘అటెలియర్ 11’ అనే స్టూడియోకు కో-ఫౌండర్‌గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు 25 ఏళ్ల రైహాన్ వాద్రా విజువల్ ఆర్టిస్ట్‌గా, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా గుర్తింపు పొందారు.డెహ్రాడూన్‌లోని డూన్ స్కూల్, లండన్‌లోని ఎస్‌వోఏఎస్ యూనివర్సిటీలో చదువుకున్న రైహాన్, తన కళాఖండాలను ముంబై, ఢిల్లీలోని ప్రముఖ గ్యాలరీల్లో ప్రదర్శించారు. ఈ జంట వివాహం వచ్చే కొన్ని నెలల్లోనే జరగనుందని సమాచారం.