తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఖండించిన డొనాల్డ్ ట్రంప్…! 

Spread the love

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ (WSJ) ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 79 ఏళ్ల వయస్సులోనూ తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, తన జీవక్రియలు పక్కాగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. అయితే, వైద్యులు సూచించిన 81 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ మోతాదులో, అంటే 325 మిల్లీగ్రాముల ఆస్పిరిన్ టాబ్లెట్లను ప్రతిరోజూ తీసుకుంటున్నట్లు ఆయన స్వయంగా ఒప్పుకున్నారు. గత 25 ఏళ్లుగా తాను ఇదే మోతాదు వాడుతున్నానని, ఇది రక్తాన్ని పల్చగా ఉంచి గుండె పనితీరును మెరుగుపరుస్తుందని ఆయన నమ్ముతున్నారు.

కాగా డోనాల్డ్ ట్రంప్ తన విలక్షణమైన శైలిలో మాట్లాడుతూ, “నా గుండెలో చిక్కటి రక్తం ప్రవహించడం నాకు ఇష్టం లేదు. అందుకే పల్చగా ఉంచేందుకు ఆస్పిరిన్ తీసుకుంటాను” అని పేర్కొన్నారు. తన చేతులపై కనిపించే గాయాల గురించి స్పందిస్తూ.. ఆస్పిరిన్ వల్ల రక్తం పల్చబడటంతో చిన్నపాటి ఒరిపిడి జరిగినా చర్మంపై రంగు మారుతుందని, దాన్ని కవర్ చేసేందుకు కేవలం పది సెకన్ల మేకప్ సరిపోతుందని వివరించారు. అలాగే వ్యాయామంపై తనకున్న విముఖతను చాటుతూ.. ట్రెడ్‌మిల్‌పై గంటల తరబడి నడవడం తనకు చాలా బోర్ కొట్టే పని అని, గొల్ఫ్ ఆడటమే తనకు సరైన వ్యాయామమని స్పష్టం చేశారు.