తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధినేత, పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు కమిటీల్లో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం మేరకు ప్రస్తుతం కొనసాగుతున్న GHMC, వీరమహిళ, యువజన, విద్యార్థి విభాగ కమిటీలను రద్దు చేసి, వాటి స్థానంలో కొంతమంది సభ్యులతో తాత్కాలికంగా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అడ్ హాక్ కమిటీలు 30 రోజుల తర్వాత రద్దు చేయబడతాయి అని తెలిపింది. ఈ అడ్ హాక్ కమిటీ సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి, ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం ఐదుగురు సభ్యులతో జాబితాను సిద్ధం చేసి పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకురానున్నారని పేర్కొంది. GHMC పరిధిలోని 300 వార్డులలో కూడా ఈ అడ్ హాక్ కమిటీ పర్యటించి జాబితాను సిద్దం చేయనుందని స్పష్టం చేశారు. ఈ కమిటీ అందించిన జాబితాల ఆధారంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే సామర్థ్యం కలిగిన వారితో నూతన కమిటీలను ప్రకటించనున్నట్లు తెలిపింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని ఒక బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కమిటీలు పనిచేయనున్నాయి