ఎగుమతుల్లో టాప్.. కొనసాగుతున్న ఐఫోన్ హవా.. భారత్ లో నయా రికార్డ్

Spread the love

అమెరికా టెక్నాలజీ  దిగ్గజం యాపిల్, భారత ప్రభుత్వ పీఎల్ఐ (PLI) పథకం కింద సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025 డిసెంబర్ నాటికి భారత్ నుంచి ఐఫోన్ల ఎగుమతులు 50 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 4.15 లక్షల కోట్లు) మార్కును దాటేశాయి. పథకం గడువు ముగియడానికి మూడు నెలల ముందే ఈ ఘనత సాధించడం గమనార్హం. కేవలం 2026 ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లోనే 16 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరగడం యాపిల్ వృద్ధికి నిదర్శనం. ఇది శాంసంగ్ వంటి ఇతర దిగ్గజాల ఎగుమతుల కంటే ఎంతో ఎక్కువగా ఉండటం గమనార్హం.

ఈ భారీ వృద్ధితో మొబైల్ ఫోన్ల తయారీలో భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా అవతరించింది. ప్రస్తుతం దేశంలోని 5 అసెంబ్లీ ప్లాంట్ల ద్వారా ఐఫోన్లు తయారవుతుండగా, మొత్తం స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో వీటి వాటా 75 శాతానికి చేరింది. అటు ఎగుమతుల్లోనే కాకుండా, దేశీయ మార్కెట్లోనూ ఐఫోన్ 16 రికార్డు స్థాయిలో అమ్ముడవుతూ అగ్రస్థానంలో నిలిచింది. ఈ సక్సెస్ నేపథ్యంలో మార్చితో ముగియనున్న పీఎల్ఐ పథకాన్ని పొడిగించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది.