వెనెజువెలాలో చోటుచేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా సైనిక దళాలు ‘ఆపరేషన్ అబ్సొల్యూట్ రిజాల్వ్’ పేరుతో ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌లను కరాకస్‌లో అదుపులోకి తీసుకోవడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది.ఈ నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) స్పందిస్తూ…వెనెజువెలాలో తాజా పరిణామాలు ఆందోళనకరం.అక్కడి పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం.ఆ దేశ ప్రజల శ్రేయస్సు, రక్షణకు భారత్ మద్దతు ఇస్తుందని ఒక ప్రకటన విడుదల చేసింది.ప్రాంతీయ శాంతిని దృష్టిలో ఉంచుకుని, సంబంధిత పక్షాలన్నీ సంయమనం పాటిస్తూ చర్చల ద్వారా సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భారత్ కోరింది.
మరోవైపు, వెనెజువెలాలో ఉన్న సుమారు 80 మందికి పైగా భారత పౌరుల భద్రత కోసం కరాకస్‌లోని భారత రాయబార కార్యాలయం నిరంతరం అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.భారత పౌరులు అత్యవసరమైతే తప్ప వెనెజువెలాకు వెళ్లవద్దని ఇప్పటికే ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.అమెరికా చర్యను రష్యా, చైనాలు తీవ్రంగా ఖండించినప్పటికీ, భారత్ మాత్రం ప్రధానంగా ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చల ద్వారా పరిష్కారం లభించాలని ఆకాంక్షించింది.