తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవాలంటే భాషను కాపాడాలి:ఏపీ సీఎం చంద్రబాబు

Spread the love

3వ ప్రపంచ తెలుగు మహాసభలలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం తెలుగు భాషాభిమానాన్ని, జాతి గౌరవాన్ని చాటిచెప్పింది. ఈ సందర్బంగా సీఎం తెలుగు భాష యొక్క ప్రాచీనతను, గొప్పదనాన్ని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా వందలాది భాషలు ఉన్నప్పటికీ, కేవలం ఆరు భాషలకే ప్రాచీన హోదా లభించిందని, అందులో తెలుగు ఉండటం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. కవిత్రయం నుండి అష్టదిగ్గజాల వరకు, గురజాడ నుండి శ్రీశ్రీ, దాశరధి వంటి మహానుభావులు తెలుగు భాషా వైభవాన్ని చాటిచెప్పారని గుర్తుచేశారు. వేమన, సుమతీ, భాస్కర పద్యాలలోని నీతి, అన్నమయ్య, వెంగమాంబ, మొల్ల వంటి వారి భక్తి మార్గం తెలుగుకు వెలుగు తెచ్చాయని కొనియాడారు. అలాగే విశ్వనాధ సత్యనారాయణ, సినారె, రావూరి భరద్వాజ వంటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు తెలుగు సాహిత్య కీర్తిని దశదిశలా వ్యాపింపజేశారని ప్రశంసించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానాయకుడు నందమూరి తారక రామారావు అని, ఆయన పేరుతో వేదిక ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని చంద్రబాబు తెలిపారు. తెలుగు వారిని ‘మద్రాసీలు’ అని పిలిచే రోజుల్లో “నేను తెలుగువాడిని.. నాది తెలుగుదేశం” అని ఎన్టీఆర్ నినదించారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ తెలుగువారికి ఆత్మగౌరవాన్ని ప్రబోధిస్తే, ప్రస్తుత తరం ప్రపంచవ్యాప్తంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని తాను పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. తెలుగు జాతికి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములును, పదవిని త్యాగం చేసిన బూర్గుల రామకృష్ణారావును ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

మాతృభాషను అమ్మతో పోలుస్తూ, మాతృభాషలో చదువుకున్న వారే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇంగ్లీష్ అవసరమే కానీ, మాతృభాషను మరిస్తే మనల్ని మనం మర్చిపోయినట్లేనని హెచ్చరించారు. టెక్నాలజీ వల్ల తెలుగు భాష కనుమరుగవుతుందనే భయం వద్దని, నిజానికి సాంకేతికత వల్ల భాషను కాపాడుకోవడం మరింత సులభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 30 ఏళ్ల క్రితం ఐటీ రంగంలో తీసుకున్న నిర్ణయాల వల్లే నేడు తెలుగు యువత ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నారని, ఆర్థిక సంస్కరణలు తెచ్చిన పీవీ నరసింహారావు మార్గంలో ఐటీని అందిపుచ్చుకుని తెలుగు రాష్ట్రాలకు సంపద సృష్టించామని వివరించారు. తెలుగు భాషా వికాసానికి కృషి చేస్తున్న ఆంధ్ర సారస్వత పరిషత్ సేవలను అభినందిస్తూ, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాజమండ్రిలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సినిమా ఈవెంట్లకు వచ్చినట్లుగా ఈ మహాసభలకు భారీ సంఖ్యలో ప్రజలు, 40 దేశాల నుండి ప్రతినిధులు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. 4వ ప్రపంచ తెలుగు మహాసభలను మారిషస్‌లో నిర్వహించడం శుభపరిణామమని పేర్కొన్నారు. తెలుగు జాతి కొన్ని సందర్భాల్లో కలిసి ఉన్నామని, మరికొన్ని సందర్భాల్లో విడిగా ఉన్నామని, ప్రస్తుతం రెండు రాష్ట్రాలుగా ఉన్నప్పటికీ తెలుగు ప్రజలందరి అభివృద్ధే తన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. హిందీ తర్వాత భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడే భాష తెలుగేనని, ఈ ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు. తెలుగు జాతికి తాను శాశ్వతంగా రుణపడి ఉంటానని, జాతి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.