రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండలం, ఇరుసుమండలో ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకేజీ ఘటన గురించి ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్, అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మంటలు వెంటనే అదుపులోకి వచ్చేలా చూడాలని… గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. జిల్లా అధికారులు, ఓఎన్జీసీ ప్రతినిధులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని మంత్రులకు, అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. పరిస్థితిపై తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కోరారు. ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకైన సంగతి తెలిసిందే. మలికిపురం మండలం ఇరుసుమండలో గ్యాస్ పైకి వెదజిమ్ముతోంది. దీంతో మంటలు ఎగసిపడ్డాయి. ఘటనాస్థలాన్ని తహసీల్దార్ శ్రీనివాసరావు పరిశీలించారు. దీనిపై ఓఎన్జీసీ ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు తెలిపారు. ఆ సంస్థ టెక్నీకల్ ఎక్స్పర్ట్స్ ఘటనా స్థలికి చేరుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.