రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో వైసీపీ చేస్తున్న విమర్శలపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు వెలగపూడి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాయలసీమకు నిజమైన ద్రోహం చేసింది జగన్ మోహన్ రెడ్డి అని ధ్వజమెత్తారు.ఎటువంటి పర్యావరణ అనుమతులు, డీపీఆర్ (DPR) లేకుండా అనాలోచితంగా ప్రాజెక్టు పనులు చేపట్టి, 2020లోనే ఎన్జీటీ (NGT) స్టే వచ్చేలా చేసింది వైసీపీ ప్రభుత్వమేనని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మాకు వ్యక్తిగత సంబంధాలు ఉండవచ్చు, కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడూ రాజీ పడదు” అని ఆయన తేల్చి చెప్పారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క ప్రాజెక్టు పనినైనా ఆపినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు.జగన్ హయాంలో రాయలసీమ ప్రాజెక్టులు కుంటుపడటం వల్లే ఆ ప్రాంత ప్రజలు ఎన్నికల్లో వైసీపీని తిరస్కరించారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎద్దేవా చేశారు.