గతేడాది ‘OG’ తో బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ తో సందడి చేసిన అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు తెలిపారు. ఇక తాజాగా ఆయన సొంత నిర్మాణ సంస్థ ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ నుంచి ఓ ఆసక్తికరమైన పోస్టర్ విడుదలైంది. 2026 జనవరి 7వ తేదీన దీనికి సంబంధించిన ప్రకటన వెలువడనుందని ఆ పోస్టర్ ద్వారా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణంలో మరో కొత్త అధ్యాయం అనే హింట్ ఈ పోస్టర్ లో ఇచ్చారు. ఇక ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ డిజైన్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది.పవన్ కళ్యాణ్ కు మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. తన కెరీర్ తొలి చిత్రాలైన ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘జానీ’ వంటి సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. చాలా సందర్భాల్లో ఆయన తన ఫైట్ సీన్లను స్వయంగా కంపోజ్ చేసుకున్నారు. కొత్తవారిని ప్రోత్సహించేందుకు స్థాపించిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నుంచి చాలా కాలం తర్వాత ప్రకటన రావడంతో ఇది సినిమానా లేక మరేదైనా ప్రాజెక్టా అనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఈ ప్రకటన వెనుక అసలు విషయం ఏమిటో తెలియాలంటే జనవరి 7 వరకు వేచి చూడాల్సిందే.