టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి రెండేళ్ల పాలన హామీలు ఘనం..అమలుకు ఘరానా మోసమని ఏపీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిల ఆరోపించారు. ప్రతి ఏటా జనవరి వస్తోంది.. పోతుంది. క్యాలెండర్ మారుతున్నా.. ఫస్ట్ తారీఖున ఇస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్ కి మాత్రం దిక్కులేదని విమర్శించారు. ఇచ్చిన వాగ్దానానికి విలువ లేదని ఉద్యోగాల పేరుతో ఆశ చూపి, భారీగా నిరుద్యోగుల ఓట్లు దండుకుని, రెండో ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ పై ఊసెత్తకుండా, వారి జీవితాలతో చెలగాటం ఆడేందుకు కూటమి ప్రభుత్వానికి సిగ్గుండాలని సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు జాబ్ క్యాలెండర్ పేరుతో యువత చెవుల్లో పూలు పెడితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏకంగా క్యాలీఫ్లవర్లు పెడుతోంది. 2025 జనవరి 1 నుంచి క్రమం తప్పని జాబ్ క్యాలెండర్ ఎక్కడ ? రెండేళ్లలో రెండు జాబ్ క్యాలెండర్ల
సంగతేంటి ? ఇదిగో అదిగో అని ఊరించడం తప్పా ఉద్యోగాల భర్తీ షెడ్యూల్ ఏది ? కూటమి ప్రభుత్వ హామీ జాబ్ క్యాలెండర్ కాదు..జోక్ క్యాలెండర్ అని సెటైర్లు వేశారు. నిరుద్యోగ బిడ్డలను దగా చేశారని జాబ్ క్యాలెండర్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది నిరుద్యోగ బిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఉన్నది అమ్ముకుని సైతం కోచింగులు తీసుకుంటున్నారు. ఉద్యోగాలు ఇస్తారా లేదా అనే తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. ఆయా ప్రభుత్వ విభాగాల్లో కలిపి ఖాళీలు 2 లక్షలకు పైగా ఉన్నట్లు అంచనా. వెంటనే 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ తక్షణం విడుదల చేయాలి. కూటమి ప్రభుత్వం కొలువయ్యాక కొలువులు ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, రాష్ట్ర నిరుద్యోగుల పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.