టీవీకే అధినేత, ప్రముఖ నటుడు విజయ్ కు కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12న ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరుగుతోంది. 2025 సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్ లో విజయ్ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించగా.. 60 మంది గాయపడిన విషయం తెలిసిందే. సుమారు 10 వేల మంది మాత్రమే కెపాసిటీ కలిగిన సభాస్థలి వద్దకు దాదాపు 30,000 మంది రావడంతో ఈ దురదృష్టకర తొక్కిసలాట ఘటన చోటుచేసుకుంది. అంతేకాకుండా, విజయ్ బహిరంగ సభ వేదిక వద్ద భద్రతా మార్గదర్శకాలను ఉల్లంఘించారని, సభకు హాజరైన వారికి సరైన ఆహారం, నీటి వసతులు కూడా కల్పించలేదని ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ నేపథ్యంలో సీబీఐ ఆయనకు నోటీసులు జారీ చేసింది.