తీర ప్రాంత అడవుల రక్షణ… ఆక్రమణల నిరోధంపై దృష్టి:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 

Spread the love

తీర ప్రాంత అడవుల రక్షణ.. ఆక్రమణల నిరోధానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ.. గ్రేట్ గ్రీన్ వాల్, 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్లాలని ఏపీ డిప్యూటీ సీఎం , అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ నెలాఖరులోపు అందుకు సంబంధించి ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆదేశించారు. తీర ప్రాంతం వెంబడి ఉన్న మొక్కలకు భద్రత కల్పించడం, అటవీ భూములు ఆక్రమణలకు గురి కాకుండా చూసే బాధ్యతను తీర ప్రాంత నివాసిత సమాజాలకు అప్పగించాలని తెలిపారు. రాష్ట్రాన్ని 50 శాతం పచ్చదనంతో నింపడం సీఎం చంద్రబాబు తనకు వ్యక్తిగతంగా నిర్దేశించిన లక్ష్యాల్లో ఒకటని, ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లాలని తెలిపారు. అనుబంధంగా ఉండే అన్ని ప్రభుత్వ శాఖలతో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లాలన్నారు.  తాజాగా ఆయన  అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ భారత దేశంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. సుమారు 974 కిలోమీటర్ల పొడవు ఉన్న తీర ప్రాంతాన్ని విపత్తుల నుంచి రక్షించడంతోపాటు రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తుందని తెలిపారు.  తీర ప్రాంతం మొత్తాన్ని 5 కిలోమీటర్ల వెడల్పు పచ్చదనంతో నింపేయాలని ఆ పరిధిలో మడ, సరుగుడు, తాటిచెట్లు లాంటి మొక్కలతో నింపేసి తుపానులు లాంటి విపత్తుల నుంచి తీర ప్రాంతానికి, తీర ప్రాంతం వెంబడి ఉన్న ఆవాసాలకు రక్షణ కల్పించాలన్నారు. ఇప్పటికే మన కోస్తా తీరం వెంబడి 402 కిలోమీటర్ల పరిధిలో 500 మీటర్ల వెడల్పున అటవీ శాఖ మొక్కలు నాటి, వాటి సంరక్షణ చర్యలు చేపడుతోందని  మిగిలిన భూముల్లో  కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలో ఉన్న భూ విస్తీర్ణం ఎంత? అందులో అటవీ శాఖ పరిధిలో ఎంత ఉంది? ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల చేతులో ఉన్న భూమి ఎంత? అన్న అంశాలపై అధ్యయనం జరిపాలని స్పష్టం చేశారు. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును మూడు దశల్లో ముందుకు తీసుకువెళ్లాలన్నారు. స్థానిక సమాజాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తూ.. ఉన్న మొక్కలను రక్షించడం, తీర ప్రాంతం వెంబడి ఆక్రమణలను నిరోధించడంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. 

ఇక 50 శాతం గ్రీన్ కవర్ సీఎం చంద్రబాబు  మనకు ప్రత్యేకంగా అప్పగించిన కార్యక్రమం. దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. గ్రీన్ వాల్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తే గ్రీన్ కవర్ కూడా పెంచినవారమవుతాము. జిల్లాల వారీగా ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖలన్నింటినీ భాగస్వామ్యం చేయాలి. మొక్కలు నాటేందుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇతర శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు.