కృష్ణా నదీ తీరాన్ని మెరీనా వాటర్ ఫ్రంట్‌ గా అభివృద్ధి:ఏపీ సీఎం చంద్రబాబు

Spread the love

రాజధాని ప్రాంతంలోని కృష్ణా నదీ తీరాన్ని మెరీనా వాటర్ ఫ్రంట్‌ గా అభివృద్ధి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు  ఆదేశించారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలకు సీఎం  అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశం ఆమోదాన్ని తెలియజేసింది. ఈ సమావేశానికి మంత్రి పి నారాయణ, సీఎస్ కే విజయానంద్, పురపాలక-సీఆర్డీఏ-ఆర్ధిక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మెరీనా వాటర్ ఫ్రంట్‌లో భాగంగా జెట్టీలు, టూరిజం లీజర్ బోట్లు, ఫుడ్ ప్లాజాలు, ల్యాండ్ స్కేప్‌ పనులను పీపీపీ విధానంలో చేపట్టేందుకు టెండర్లు పిలవాలని సీఎం సూచించారు. వాటర్ ఫ్రంట్ రూపకల్పనకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని రివర్ ఫ్రంట్‌తో పాటు వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. బ్లూ- గ్రీన్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దే క్రమంలో అంతర్గత కాలువల నిర్మాణం, సుందరీకరణ పనులు జరగాలన్నారు. ప్రకాశం బ్యారేజీ ఎగువన నిర్మించే కొత్త బ్యారేజ్‌తో రాజధానికి నీటి వనరులు సమకూరతాయని తెలిపారు.  కృష్ణానదికి ఇరు వైపులా అద్భుతమైన వాటర్ ఫ్రంట్ అభివృద్ధి చేసుకోవచ్చని సూచించారు. 

స్వయం సహాయ సంఘాలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు బ్రాండింగ్

రాష్ట్రంలో స్వయం సహాయ సంఘాలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్ అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్ హెచ్ జీలు తయారు చేస్తున్న 23 వేలకు పైగా ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి బ్రాండింగ్, మార్కెటింగ్ జరగాలని దిశానిర్దేశం చేశారు. ఎస్ హెచ్ జీ మహిళా సంఘాలు, మైక్రో ఎంట్రప్రెన్యూర్స్ కు ఆర్ధిక సుస్థిరత వచ్చేలా ఉత్పత్తులను వ్యవస్థీకృతం చేయాలని సూచించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సెర్ప్ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.